వరంగల్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాకతీయ రాజుల స్ఫూర్తితో తెలంగాణలో సుపరిపాలన సాగుతున్నదని ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ కొనియాడారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించిన కాలంలో కాకతీయ పాలకులు ముందుచూపుతో గొలుసుకట్టు చెరువులను తవ్వించారని గుర్తుచేశారు.
కాకతీయల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించిందని చెప్పారు. చారిత్రక వరంగల్ నగరం పులకించిపోయేలా గురువారం ప్రారంభమైన కాకతీయ వైభవ సప్తాహం వేడుకలకు తొలిరోజు ముఖ్యఅతిథిగా కమల్‌చంద్ర హాజరయ్యారు. పర్యాటక మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి కాకతీయుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొన్నారు.
వరంగల్‌లోని పోచమ్మమైదాన్ జంక్షన్లో రాణిరుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేశారు. కాకతీయ రాజధాని కేంద్రం ఖిలా వరంగల్‌ను సందర్శించారు. స్వయంభూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. వెయ్యి స్తంభాల ఆలయాన్ని, అగ్గలయ్య గుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా కమల్‌చంద్ర మాట్లాడుతూ.. 700 ఏండ్ల క్రితం ఇక్కడి నుంచి వెళ్లిన కాకతీయుల మూలాలు ఉన్న వరంగల్ నగరానికి రావడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.
కాకతీయ వైభవ సప్తాహంతోనే ఇది జరిగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. బస్తర్ ప్రాంతంలోనూ ప్రతి గ్రామానికి రెండు, మూడు చెరువులను, తాగునీటి ట్యాంక్‌లను నిర్మించామని పేర్కొన్నారు. పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో కాకతీయులు పాలన చేశారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో పాలన సాగుతున్నదని కొనియాడారు. భద్రకాళీ అమ్మవారిని దర్ళించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బస్తర్‌లో దంతేశ్వరి అమ్మవారిని పూజిస్తామని చెప్పారు.
ఓరుగల్లులోనే దంతేశ్వరి మూలాలు ఉన్నాయని, ఇక్కడి నుంచే దంతేశ్వరి అమ్మవారు బస్తర్ వచ్చిందని పేర్కొన్నారు. భద్రకాళీ, దంతేశ్వరి అమ్మవారి అశీస్సులు తెలంగాణ, బస్తర్ ప్రజలకు ఉండాలని ఆకాక్షించారు. వరంగల్ ప్రజల ప్రేమ, ఆప్యాయతలు చూస్తుంటే సొంతూరు బస్తర్‌లో ఉన్నట్టుగానే ఉన్నదని అన్నారు. కాకతీయ పాలకులు 700 ఏండ్ల క్రితం వరంగల్ నుంచి బస్తర్‌కు వెళ్లారని చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్లో తన తాత పేరు మహారాజ ప్రవీర్ చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ అని ఉన్నదని, ఆ పేరుతోనే పరిశోధన చేసే అవకాశం వచ్చిందని వివరించారు. ఇంటి పేరు తర్వాత కాకతీయ అని ఉండడానికి కారణాలు తెలుసుకొనే పరిశోధనలో తమ కుటుంబానికి ఇక్కడితో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. కాకతీయులకు ఏడు అంకె ప్రత్యేకమైనదని చెప్పారు.
భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
కాకతీయ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, ఆలయ ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు శేషు, అర్చక బృందం మంగళవాయిద్యాలతో కమల్‌చంద్రకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ చరిత్రను కమల్‌చంద్రకు వివరించారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో భద్రకాళీ ఆలయం వెనుక బండ్‌పై బిల్వ, కబంధ మొక్కలను నాటారు. ఆలయ ఆవరణలో కళాకారులు చేసిన పేరిణి నృత్యాన్ని తిలకించారు. కమల్‌చంద్ర భంజ్‌దేవ్ వరంగల్ నగర పర్యటన సందర్భంగా ఆయనకు వెయ్యి మంది కళాకారులతో ఘన స్వాగతం పలికారు.
కాకతీయుల స్ఫూర్తితో పాలన
కాకతీయులను ఆదర్శంగా తీసుకొని సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ప్రతి నీటి బొట్టును సద్వీనియోగం చేసుకొనేలా కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేశారని గుర్తుచేశారు. కాకతీయుల వారసుల రాకతో ఓరుగల్లు పులకించిందని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలని ఆకాంక్షించారు. కాకతీయుల నగరం వరంగల్‌ను సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
వైభవంగా సప్తాహం
కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమానికి కాకతీయుల వారసుడు, బస్తర్ మహారాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ రావడం ఆనందంగా ఉన్నదని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆహ్వానం మేరకు కమల్‌చంద్ర ఇక్కడికి వచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజులపాటు వైభవంగా కాకతీయ సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు.
-చీఫ్ విప్ దాస్యం
మంచి కార్యక్రమం కాకతీయ సప్తాహ వేడుకలకు కాకతీయుల నిజమైన వారసులు రావడం మంచి అనుభూతి అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
-మంత్రి సత్యవతి
‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికకు జేజేలు
ఖిలావరంగల్, జూలై 7: వరంగల్‌లోని కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికకు ప్రజలు, కవులు, కళాకారులు, చరిత్ర పరిశోధకులు జేజేలు పలికారు. కాకతీయుల చరిత్ర ప్రతాపరుద్రుడితో అంతం కాలేదని వారి సామ్రాజ్యపు ఆనవాళ్లు బస్తర్‌లో ఉన్నాయని ‘నమస్తే తెలంగాణ’ 2014 సెప్టెంబర్ 15న ‘బస్తర్‌లో రెండో కాకతీయుల సామ్రాజ్యం’ కథనం వెలువరించింది. అదే ఏడాది నవంబర్ 5న ‘ఓరుగల్లు టూ జగదల్పూర్, చెరగని చరిత్రకు సజీవ సాక్ష్యాలు’, నవంబర్ 6న ‘ఇప్పటికీ మహారాజే, నవంబర్ 7న ‘ఆలయంలో ఆనవాళ్లు’ ఇలా వరుస కథనాలతో మేధావులను, పరిశోధకులను కదిలించింది. ఈ కథనాలన్నింటినీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఫెక్సీల్లో ప్రింట్ వేయించి మట్టికోట పశ్చిమ ద్వారం వద్ద ఏర్పాటు చేయించారు. ఇది వీక్షించిన స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.