Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ) : మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే సంకల్పం సడలుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఓవర్ హెడ్ ట్యాంకులను నిబంధన ప్రకారం శుభ్రం చేయడం లేదు. నీటి క్లోరినేషన్ను కూడా పట్టించుకోవడం లేదు. ప్రజలు ఎవరైనా వచ్చి అడిగేతప్ప, పంచాయతీ సిబ్బంది నీళ్ల ట్యాంకులను శుభ్రం చేసే పరిస్థితిలేదు. సర్పంచుల పదవికాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది.
రేవంత్రెడ్డి సర్కారు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కార్యదర్శులకు వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నది. పంచాయతీ నిర్వహణకు ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. ఫలితంగా గ్రామాల పాలన కార్యదర్శులు ప్రహసనంగా మారింది. అప్పులు చేసి మరీ పారిశుధ్య నిర్వహణ వంటి అత్యవసర పనులను నిర్వహిస్తున్నారు. కానీ, మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకు పరిస్థితి పట్టించుకొనే వారు లేకుండాపోయారు. భగీరథ పైప్లైన్లు లీకేజీలను అరికట్టకపోతున్నారు. ట్యాంకులను శుభ్రం చేయకుండానే నీటిని సరఫరా చేస్తున్నారు. కొందరు నెలకు ఒకసారి, రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లో మూడు, నాలుగుసార్లు మాత్రమే శుభ్రం చేసినట్టు కార్యదర్శులే చెప్తున్నారు.
గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతినెలా 1, 11, 21 తేదీల్లో, అంటే పది రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని నిబంధనలు ఉన్నాయి. శుభ్రం చేసిన తేదీలను ట్యాంకుల వద్ద, వాటర్ రిజిస్టర్లో నమోదు చేయాలి. పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో వాటర్మెన్ ట్యాంకులను నెలకు మూడుసార్లు శుభ్రంచేయాలి. బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ నిబంధన అమలుకావడంలేదు. నిధులు లేకపోవడమే ఇందుకు కారణమని కార్యదర్శులు చెప్తున్నారు.
నిధులు లేక, పనులు జరగక స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. అభివృద్ధి పనులు జరగడం లేదు. కనీస మౌలిక వసతులు కల్పించడానికి కూడా కార్యదర్శులం కష్టపడాల్సి వస్తున్నది. క్లోరినేషన్, శానిటేషన్తోపాటు పారిశుద్ధ్య కార్మికులు పనిముట్లు కూడా కొందరు అందించలేకపోతున్నారు. బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే పరిస్థితి లేదు. వీధిలైట్లు, నీటి సరఫరా మోటారు రిపేరు చేయలేని, లీకేజీలు అరికట్టలేని పరిస్థితులు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను రూపంలో వసూలైన డబ్బులు వాడుకొనే పరిస్థితి కల్పిస్తే కార్యదర్శులకు కొంత వెసులుబాటు ఉంటుంది.