(స్పెషల్ టాస్క్ బ్యూరో)/ హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నల్లా పథకంతో యుద్ధప్రాతిపదికన మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే, ఈ పథకాన్ని కాపీ కొట్టి ప్రచార ఆర్భాటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన ‘హర్ ఘర్ జల్ యోజన’ అట్టర్ ఫ్లాప్‌గా మారింది. నాలుగేండ్లు గడుస్తున్నా కేవలం 60 శాతం ఇండ్లకు మాత్రమే మంచినీటి నల్లా సదుపాయం కల్పించగలిగింది.
ఇంకా 8 కోట్ల ఇండ్లకు నల్లా నీరు కరువు
2019లో జల్‌జీవన్ మిషన్ ప్రారంభించే నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 19.43 కోట్ల ఇండ్లకు నల్లా నీళ్లు లేవని కేంద్రం నిర్ధారించింది. ఇందులో ఇప్పటి వరకు 11.66 కోట్ల ఇండ్లకు మాత్రమే నల్లా సదుపాయం కల్పించగలిగింది. తెలంగాణ రెండేండ్లలో ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తే… కేంద్రం నాలుగేండ్లు పూర్తయినా ఆ పని చేయలేక పోవడం దారుణమని విమర్శిస్తున్నారు.
పలు రాష్ర్టాల్లో దారుణ పరిస్థితి
కేంద్రం తెలిపిన ప్రకారం.. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో కేవలం 35 శాతం ఇండ్లకు మాత్రమే నల్లా ద్వారా మంచి నీరు అందుతున్నది. యూపీలోని అలీగఢ్ జిల్లాలో అయితే 18 శాతం ఇండ్లకు మాత్రమే నల్లా నీళ్లు వస్తున్నాయి. ఆ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 4.32 లక్షల ఇండ్లకు నీరందించాల్సి ఉండగా, ప్రస్తుతం 80 వేల ఇండ్లకే నీరందుతున్నది.