పాలకుర్తి, నవంబర్ 21 : లంచం తీసుకుంటూ మిషన్ భగీరథ డీఈ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జనగామ జిల్లా పాలకుర్తిలో చోటుచేసుకున్నది. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. మిషన్ భగీరథ డీఈ కూనమల్ల సంధ్యారాణి దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన పైపులైన్ బిల్లులు రూ.1.05 లక్షలు పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ కమ్మగాని సురేశ్‌కు చెల్లించాల్సి ఉన్నది. ఇందుకుగాను ఆమె సదరు కాంట్రాక్టర్ నుంచి రూ.10వేలు లంచం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం పాలకుర్తిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో డీఈ ప్రైవేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహేందర్నాయక్కు ఫోన్ పే ద్వారా రూ.10వేలు పంపాడు. దానిని స్క్రీన్‌షాట్‌ను డీఈ సంధ్యారాణికి చూపించాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు మిషన్ భగీరథ కార్యాలయంలో డీఈని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.