ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 19:37:51

ములుగు జిల్లాల్లో పూర్తైన మిష‌న్ భ‌గీర‌థ‌

ములుగు జిల్లాల్లో పూర్తైన మిష‌న్ భ‌గీర‌థ‌

ములుగు : రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మం మిష‌న్ భ‌గీర‌థ కింద ములుగు జిల్లాలోని దాదాపు అన్ని ఆవాసా గ్రామాల‌కు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందుతోంది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో మొత్తం 505 ఆవాసా గ్రామాల‌కుగాను 496 గ్రామాల‌కు తాగునీరు స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్నట్లు గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) అధికారులు తెలిపారు. ఈ పథకం కింద 381 నూత‌న ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టగా వీటిలో 378 పూర్తి అయిన‌ట్లు వెల్లడించారు. మ‌రో మూడింటి నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చిందన్నారు. మరోవైపు ఇప్ప‌టికే ఉన్న 224 వాట‌ర్ ఓవ‌ర్ హెడ్ ట్యాంకులకు మ‌ర‌మ్మ‌తులు చేపట్టిన‌ట్లు తెలిపారు. 1,036.78 కిలోమీటర్ల పైప్‌లైన్ మార్గంతో 84,587 ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జ‌రిగింద‌న్నారు. దెబ్బతిన్న 44.84 కిలోమీట‌ర్ల మేర సీసీ రోడ్లలో 42.29 కిలోమీటర్ల పొడవున రోడ్ల‌ను ఇప్ప‌టికే బాగుచేసిన‌ట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. ఇటీవల ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమావేశం నిర్వహించిన‌ట్లు చెప్పారు. గ్రామాల్లో నూత‌నంగా ఏర్ప‌డిన కాలనీలు, జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, అంగవాండి కేంద్రాలకు కూడా ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు.


logo