(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ‘మిస్ ఇంగ్లండ్‌తో.. మిస్ బిహేవ్’ ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు నిరాధారమైనవని, ఆమె వ్యాఖ్యలను ప్రచురించిన టాబ్లాయిడ్ (దిసన్)కు అంత ప్రాధాన్యం లేదని అంటూ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ సహా ప్రభుత్వ పెద్దలు ఇంతకాలం కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే, హైదరాబాద్‌లో జరిగిన ‘మిస్ వరల్డ్-2025’ పోటీల్లో మ్యాగీకి ఎదురైన అనుభవాలను 200 ఏండ్లకుపైగా చరిత్ర కలిగి, బ్రిటన్‌లోనే ప్రఖ్యాత డైలీగా పేరొందిన ‘ది గార్డియన్’ పత్రిక కూడా తాజాగా ప్రచురించింది. ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాగీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
‘ది గార్డియన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాగీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు తాము ఎందుకు వచ్చామోనన్న విషయాన్ని చెప్పనీయకుండా, అతిథులను అలరించడానికే అన్నట్టు తమను గ్లామర్ బొమ్మలుగా వాడుకొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తన దగ్గరికి వచ్చి అసంబంద్ధంగా ప్రవర్తించిన తీరును కూడా ఆమె వివరించారు. ‘ఈవెంట్ జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నెక్స్ టైమ్ తాను లండన్ లేదా ఇంగ్లండ్‌కు రానున్నట్టు చెప్పాడు. అక్కడ ఇద్దరం కలిసి ఏకాంతంగా గడుపుదాం (హుక్మీ అప్) అంటూ చెప్తూ అక్కడి నుంచి ఉడాయించాడు. అతని వ్యాఖ్యలతో నేను ఎంతో అసౌకర్యానికి గురయ్యా. అతనెవరో కూడా నేను సరిగ్గా చూడలేదు’ అంటూ మ్యాగీ ఆవేదన వ్యక్తంచేశారు. పోటీల్లో తనకు ఎదురైన అనుభవాలను ధైర్యంగా చెప్పినందుకు కొందరు సోషల్‌మీడియాలో తనను తప్పుబట్టారన్న మ్యాగీ.. ఈ విషయంలో తానేమీ బాధపడటం లేదని చెప్పారు. తన విలువలను తాను కాపాడుకోవడం తనకు ఎంతో ముఖ్యమని ఉద్ఘాటించారు.
‘పోటీలో గెలవలేనన్న కారణంతోనే మ్యాగీ వెళ్లిపోయింది’ అంటూ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో, చైర్పర్సన్ జూలీ మోర్లే చేసిన వ్యాఖ్యలు తనపై ప్రతీకారపూరితంగా ఉన్నాయని మ్యాగీ ధ్వజమెత్తారు. మోర్లే వాదన అసంబద్ధమైనదని కొట్టిపారేశారు. మోర్లే చెప్పినవన్నీ అబద్ధాలేనని పునరుద్ఘాటించారు. ‘నేను ఏదైతే నమ్ముతానో, ఏ విలువలైతే నాకు ఉన్నాయో.. అలాంటి వాటికి కట్టుబడి ఉన్నాను. అందుకే, అలాంటి వాతావరణంలో ఉండలేక నేను వెనుదిరిగి వచ్చాను’ అంటూ మ్యాగీ తేల్చి చెప్పారు. సీపీఆర్ క్యాంపెయిన్‌కు సాయపడుతుందన్న ఉద్దేశంతోనే తాను పోటీల్లో పాల్గొనడానికి సిద్ధపడ్డానని, అయితే, హైదరాబాద్‌కు వచ్చాక వాస్తవానికి భిన్నమైన పరిస్థితులను చవిచూశానని వాపోయారు. పురుషుల ముందు పరేడ్ చేయలేక, డబ్బు ఉన్నవారిని సంతోషపెట్టే వస్తువుగా ఉండలేకనే వెనుదిరిగి వచ్చానని మరోసారి స్పష్టంచేశారు. ‘హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్లో పైకి కనిపించిన నవ్వుల వెనుక ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. అబద్ధాలు చెప్పి నేను అక్కడ ఉండాలని అనుకోలేదు’ అని మ్యాగీ కన్నీటి పర్యంతమయ్యారు.
హైదరాబాద్ ఈవెంట్లో తాను ఒక్కదాన్నే ఇలాంటి వేధింపులకు గురికాలేదని మ్యాగీ తెలిపారు. తాను ఎదుర్కొన్న అనుభవాలనే మిగతా పోటీదారులు కూడా ఎదుర్కొన్నారని, ఇదే విషయమై వారు తనకు వందల మెసేజ్‌లు పంపించారని తెలిపారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని.. అలా జరుగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చేపట్టాలి. అయితే, అలా చేయాల్సింది పోయి.. తనపై అసంబద్ధ వ్యాఖ్యలతో ఎదురుదాడికి దిగడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంగా తాను ఎదుర్కొన్న వేధింపులను మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ‘ది సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిర్వాహకుల తీరుతో ‘తాను ఏమైనా వేశ్యనా ఏంటి?’ అనే భావన తనకు కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. మనసు చంపుకొ ని ఉండలేకనే పోటీల మధ్య నుంచి వైదొలిగినట్టు తెలిపారు. మ్యాగీ వ్యాఖ్యలను ఖండించిన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో, చైర్పర్సన్ జూలీ మోర్లే.. ‘ది హిందూ’ పత్రికతో వారం కిందట మా ట్లాడారు. ‘పోటీలో చివరివరకూ నిలబడతానన్న నమ్మకం లేకనే మ్యాగీ మధ్యలో వెళ్లిపోయిందం’టూ మోర్లే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాలంటూ ‘ది గార్డియన్’ పత్రికకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేవిన్ రాలిన్సన్ మ్యాగీని కోరారు. దీంతో తనకు ఎదురైన అనుభవాలను మ్యాగీ గార్డియన్ పత్రికతో శనివారం పంచుకొన్నారు.