Miss World | రంగారెడ్డి, మే 12 : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై సోమవారం పోలీసులు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు బాంబుస్వ్యాడ్, డాగ్స్వ్యాడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అందాల పోటీకి వివిధ దేశాల నుంచి విచ్చేసిన భామలు సోమవారం నాగార్జునసాగర్ పర్యటనకు బయల్దేరారు. వీరు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా బొంగ్లూరు ఎగ్జిట్ నెంబ 12వద్ద దిగారు. అక్కడి నుంచి బొంగ్లూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, మల్లెపల్లి, అంగడిపేట, పెద్దపురం మీదుగా నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. దీంతో రాచకొండ సీపీ సుధీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునితారెడ్డిల నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులతో అడుగడుగునా బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరోవైపు విస్తృతంగా తనిఖీలు కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి, గవర్నర్లకు ఇచ్చే విధంగా సెక్యూరిటీ ఇచ్చారు. సుమారు పది ఎస్కార్ట్ వాహనాల మధ్య మూడు ప్రత్యేక బస్సుల్లో వారిని నాగార్జునసాగర్‌కు తీసుకెళ్లారు. ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా మధ్యాహ్నం వరకు వారు నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి తిరిగి వారు సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు వెళ్లే వరకు తిరిగి సాగర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేవరకు పోలీసులు ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరు వచ్చిపోయే సమయంలో రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.