వరంగల్, మే 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు పేదల పాలిట శాపంగా మారా యి. అందాల పోటీల్లో పాల్గొంటున్న యువతులు బుధవారం వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తున్నది. అందాల భామల కంటికి నగర దుస్థితి కనిపించకుండా ప్రభుత్వం రకరకాల ఏర్పాట్లు చేసింది. మోరీలు, మురుగు కాల్వలు కనిపించకుండా అడ్డుగా పరదాలను కట్టించింది.
రోడ్ల వెంబడి ఉండే డబ్బాలను బుల్డోజర్లతో తొలగించి దూరంగా జరిపింది. కాజీపేట నుంచి ఫాతిమా జంక్షన్, నిట్, వడ్డేపల్లి, నక్కలగుట్ట, హనుమకొండ చౌరస్తా, వెయ్యి స్తంభాల గుడి, ఎంజీఎం చౌరస్తా, కాశీబుగ్గ ప్రాంతాల్లో రోడ్లపై ఉండే చిరువ్యాపారులను తరిమేశారు. మిస్ వర్డల్ పోటీల్లో పాల్గొనే యువతుల పర్యటన నేపథ్యంలో నగరంలో ఓపెన్ డ్రైనేజీ, మురుగు కాల్వలు కనిపించకుండా అధికారులు నానాపాట్లు పడ్డారు. మురికి కాల్వలు, డ్రైనేజీల వద్ద బారికేడ్లు, పరదాలను ఏర్పాటు చేశారు.
దుకాణాల తొలగింపుపై బీఆర్ఎస్ ధర్నా
అందాల భామల వరంగల్ పర్యటన సందర్భంగా రోడ్డుపక్కనున్న చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిని నిరసిస్తూ బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ నగర చారిత్రక నేపథ్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి తాము వ్యతిరేకం కాదని, సుందరీమణుల పర్యటనలో పేదల వ్యాపార సముదాయాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
తొలగించిన డబ్బాలను 48 గంటల్లో పునరుద్ధరించాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా ఎంజీఎం జంక్షన్‌కు చేరుకుని రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు
ప్రపంచ సుందరీమణుల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో బుధవారం బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, ఐద్వా, పీడీఎస్‌యూ, బీజేపీ మహిళా మోర్చా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ఎల్లావుల లలితాకుమార్యాదవ్, 4వ డివిజన్ అధ్యక్షుడు మనోజ్‌కుమార్, బీఆర్ఎస్వీ నాయకుడు రాజేందర్, దిశ కమిటీ మాజీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, మబ్బు రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అహల్య, జిల్లా ప్రధాన కార్యదర్శి షబానా, పట్టణ అధ్యక్షురాలు పందిళ్ల కల్యాణిని అదుపులోకి తీసుకొన్నారు.