మైనారిటీల్లోని చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను శనివారం ఎల్బీ స్టేడియంలో లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ. చిత్రంలో ఎమ్మెల్సీలు ప్రభాకర్, సలీం, మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫండీ, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్, ఏకేఖాన్ తదితరులు
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కారు 8,056 మంది మైనార్టీలకు లక్ష సాయం కింద 80.56 కోట్ల విలువ చేసే చెక్కులను శనివారం ఒక్కరోజే పంపిణీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మైనార్టీల్లోని చేతి వృత్తిదారులు, చిరువ్యాపారుల కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, తెలంగాణ సర్కారు సబ్బండ వర్ణాలకు అండగా ఉంటున్నదని, పేదరిక నిర్మూలనకు ఎనలేని కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లకాలంలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ సర్కారు బడ్జెట్లో 2,200 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ఈ నిధుల నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ. 270 కోట్లు కేటాయించి వంద శాతం సబ్సిడీతో లక్ష ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మందికి ప్రయోజనం చేకూరనున్నదని వెల్లడించారు. ఇవాళ ఒక రోజే రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందికి 100 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదేండ్లకాలంలో ఎలాంటి అల్లర్లు, అలజడి లేకుండా జనరంజకంగా పాలన కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ పెద్దపీట వేశారని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. మైనార్టీలంతా బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో మొత్తంగా 10 వేల మంది మైనార్టీలకు రూ.లక్ష సాయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలకు సంబంధించి తొలి విడతలో 3,508 మందిని ఎంపిక చేసింది. మిగిలిన జిల్లాల్లో 6,492 మంది నిరుపేద మైనార్టీ లబ్ధిదారులను గుర్తించింది.
వర్షాల కారణంగా మిగతావారికి పంపిణీలో జాప్యం జరుగ్గా, త్వరలోనే అందరికీ అందజేయనున్నది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు అబ్దు ల్ అహ్మద్ బీన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, మైనార్టీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, హజ్ కమి టీ చైర్మన్ మహ్మద్ సలీం, మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఇప్తారియా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసివుల్లా ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమర్ జలీల్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.