‘ఇకపై చిరుద్యోగులకు నెలనెలా వేతనాలు ఇస్తాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) పరిధిలో పనిచేసే సుమారు 92 వేల మంది పైచిలుకు ఉద్యోగులకు గ్రీన్‌చానెల్ ద్వారా రూ.115 కోట్లు చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వీరికి కూడా ఒకటో తేదీనే వారి అకౌంట్లలో వేతన మొత్తాన్ని జమచేస్తాం’
– ఇదీ గత ఏప్రిల్‌లో మీడియా ముఖంగా మంత్రి సీతక్క ఇచ్చిన హామీ
‘పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 92 వేల మంది పైచిలుకు గ్రామస్థాయి ఉద్యోగులకు గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా జీతాలుచెల్లిస్తున్నాం’
– రెండురోజుల క్రితం ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి సీతక్క ఇలా సెలవిచ్చారు.
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలేనని ఇప్పటికే తేలిపోయింది. అదే అబద్ధాల బాటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కూడా వెళ్తున్నారు. ఆమె శాఖలోని చిరుద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందకపోగా, 92 వేల మందికిపైగా గ్రామస్థాయి ఉద్యోగులకు గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్నామని చెప్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఆశాఖలోని సుమారు 92 వేల పైచిలుకు మంది చిరుద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందడమే లేదు. మార్చి నెలలో చివరిసారి వారు వేతనాలు తీసుకున్నారు. ఏప్రిల్, మే నెల వేతనాలు ఇంకా రావాల్సి ఉన్నది. 20వ తేదీ వచ్చినా నేటికీ వారికి వేతనాలు రాలేదు. దీంతో ఉద్యోగులంతా ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు.
‘ఇకపై చిరుద్యోగులకు నెలనెలా వేతనాలు ఇస్తాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే సుమారు 92 వేలపై చిలుకు మంది ఉద్యోగులకు గ్రీన్‌చానెల్ ద్వారా రూ.115 కోట్లు చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వీరికి కూడా ఒకటో తేదీనే వారి అకౌంట్లలో వేతన మొత్తాన్ని జమచేస్తాం’ అని సీతక్క ఏప్రిల్‌లో మీడియా ముఖంగా హామీఇచ్చారు. జనవరి నుంచి చిరుద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లిస్తామని ఆమె చెప్తూ వస్తున్నారు.
కానీ, ఆమె హామీ మాత్రం అమలు కావడమే లేదు. గతంలో ఒక్కోసారి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు వేతనాలు పెం డింగ్ పడిన ఘటనలు కూడా ఉన్నాయి. గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించే విధానానికి సంబంధించిన ఫైల్ ఫైనాన్స్ శాఖ వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు సమాచారం. మూడు నాలుగు నెలలు ఆ ఫైల్‌కు మోక్షం లభించడమే లేదు. రెండు నెలల వేతనం అందకపోతే పిల్లల స్కూల్ ఫీజులు ఎలా చెల్లించాలి. రూమ్‌రెంట్లు, బండి మీద ఆఫీసుకు వెళ్లి రావడానికి పెట్రోల్ ఖర్చులకు కూడా డబ్బుల్లేవు.. ఓ టెక్నికల్ అసిస్టెంట్ ఆవేదన వ్యక్తంచేశారు.