Industrial Parks | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఏదైనా ఒక కాంట్రాక్టు పనికి టెండర్లు పిలిస్తే ఆయా పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు పోటీ పడి.. ఇతరుల కంటే తక్కువ కోట్ చేసి పనులు దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పనుల్లో మాత్రం ఓ విచిత్రమైన పోటీ నెలకొన్నది. తాము చెప్పిన కంపెనీలకే పనులు దక్కాలంటూ మంత్రులు మొదలు పలువురు ఎమ్మెల్యేలు పనుల పందేరానికి కాలు దువ్వడంతో కాంట్రాక్టు వృత్తిలో ఉన్న కంపెనీలే తట్టుకోలేక పక్కకు 2వ పేజీలోతప్పుకున్నాయి. మరి.. ఇవేవో వందలు, వేల కోట్ల పనులు కూడా కాదు. నాలుగుచోట్ల పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం చేపడుతున్న అభివృద్ధి పనుల అంచనా వ్యయం రూ.100కోట్లలోపే ఉందంటే అధికార పార్టీ నేతలు ఏ చిన్న కాంట్రాక్టును సైతం వదలడంలేదని స్పష్టంగా తెలుస్తున్నది.
వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి-భువనగిరి, పరకాల నియోజకవర్గాల పరిధుల్లో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టీజీఐఐసీ టెండర్లు రూపొందించింది. ఈ మేరకు నాలుగుచోట్ల వివిధ అంచనా వ్యయాలతో టెండర్లు పిలవగా… సాధారణ కాంట్రాక్టర్లు సైతం పాల్గొన్నారు. కానీ ఈ శాఖతో అసలు సంబంధమేలేని ఇద్దరు మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ టెండర్లపై ఓ నజర్ వేశారు. ఇందులో కొందరికి నేరుగా కొన్ని కంపెనీలతో సంబంధం ఉండగా.. మరికొందరు తమ అనుచరులకు సంబంధించిన కంపెనీల కోసం పనుల పందేరంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలోని దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఫేస్-2 అభివృద్ధికి సంబంధించి రూ. 34.11 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనుల కోసం ఇద్దరు మంత్రులు పోటీపడ్డారు.
వీరిలో ఒకరు కాంట్రాక్టు పనుల్లో ఆరితేరి.. అనుభవం ఉండి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు కాంట్రాక్టులు దక్కించుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారు. మునుపు ఇలాంటి అనుభవం లేకున్నా పోటీపడితే పోయేదేముంది! అన్నట్టు తనకు చెందిన వారి కంపెనీ కోసం మరో మంత్రి ‘చక్రం’ తిప్పారు. స్థానిక ఎమ్మెల్యే సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు.. అసలే నా ఇలాఖా… తనకే పనులు కావాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాంట్రాక్టులు దక్కించుకోవడంలో సిద్ధహస్తుడైన ఒక మంత్రి నిరుడు మాదిరిగానే ఈసారి కూడా ఆవు కథ వినిపించినట్టు సమాచారం. దీంతో చివరకు ఆయన మాటనే నెగ్గడంతో సదరు మంత్రివర్యులు చెప్పిన కంపెనీకే పనులు దక్కినట్టు తెలిసింది. అయితే ఇందులో ఇంకో మతలబు ఉన్నది. ఈ టెండర్లలో ఆ కంపెనీ కంటే తక్కువ కోడ్ చేసిన వారిని సైతం పక్కనబెట్టి అమాత్యులు చెప్పిన వారికే పనులు ఇవ్వాలని నిర్ణయించడం మంత్రులు-అధికారుల మధ్య మంచి అవగాహన ఉందనేది నిదర్శనం.
వికారాబాద్ జిల్లా ఎనకతల గ్రామ పరిధిలో రూ.44 కోట్లతో చేపడుతున్న ఇండస్ట్రియల్ పార్క్ పనులను ఉన్నత పదవిలో ఉన్న బడానేత పట్టుబట్టి మరీ తన అనుచరుడికి ఇప్పించుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని మాదారంలో రూ.14 కోట్లతో చేపడుతున్న పనులకు కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే పోటీపడినట్టు తెలిసింది. ఇక వరంగల్ జిల్లా గీసుకొండలోని కేఎంటీపీ ఫేస్-2లో భాగంగా సుమారు రూ.6 కోట్లతో చేపడుతున్న పనులను మరో ఎమ్మెల్యే తన మనుషులకు ఇప్పించుకున్నట్టు కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు. తామెలా బతకాలంటూ కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు.