వరంగల్, అక్టోబర్ 12 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : మేడారం పనుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అతిజోక్యంపై ముందు కినుక వహించి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళా మంత్రులు సురేఖ, సీతక్క.. సీఎం రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.71 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఈ విషయంలో తమకు కనీస సమాచారం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పుడు ఆ వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. దేవాదాయశాఖ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్ల విషయంలో పొంగులేటి అతిజోక్యం ఎందుకని మంత్రి కొండా సురేఖ, తన నియోజక వర్గంలో చేపట్టే పనులపై మాటమాత్రంగానైనా చెప్పలేదని మంత్రి సీతక్క అలకబూనారు. ఈ ఇద్దరు మంత్రులు.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను వేర్వేరుగా కలిశారు. ఆ సమయంలో పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తనను ఇద్దరు మంత్రులు కలిశారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
సీఎం రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గారా?
మంత్రుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరు ఎటు దారితీస్తుందోననే అనుమానంతో సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. మేడారం నేపథ్యంగా వెలుగుచూసిన వ్యవహారాలను, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే పనులపై వివాదం చేయడం ఏమిటి? మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారని సమాచారం. అన్ని విషయాలను ముఖ్యమంత్రే అధిష్ఠానానికి నివేదించేందుకు సిద్ధమయ్యారనే విషయం విస్తృతంగా ప్రచారమైంది. పొంగులేటి తమ ఆత్మాభిమానంపై దెబ్బకొడుతున్నారని వాపోయిన కొండా దంపతులను కాదని, అజమాయిషీ, ఆధిపత్యం ప్రదర్శించే మంత్రి పొంగులేటికే మద్దతు ఇచ్చేలా సీఎం వ్యవహారం ఉన్నదని కొండా దంపతులు తమ సన్నిహితులతో వాపోయినట్టు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంలో సీఎం రంగంలోకి దిగడంతో మంత్రి సీతక్క వెనక్కి తగ్గినట్టు ప్రచారం సాగుతున్నది.
నాకెవరూ క్లాస్ తీసుకోలేదు: సురేఖ
తాజా పరిణామాలపై మంత్రి సురేఖ స్పందించారు. తాను పార్టీలైన్ దాటనని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు క్లాస్ పీకిందని వస్తున్న ప్రచారం ఉత్తదేనని కొట్టిపారేశారు. రెండు రోజులుగా ఇంట్లోనే ఉన్నట్టు స్పష్టంచేశారు.
నేటి పొంగులేటి పర్యటనపై ఆసక్తి
వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు జరిగే మేడారం మహాజాతర పనులను సమీక్షించేందుకు వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మేడారం రానున్నారు. ఈ పర్యటనలో మంత్రులు భాగస్వాములు అవుతారా? లేదా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.