హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 2 (నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖలో పనిచేసే అర్చకులు, పురోహితులు శాఖాపరమైన అనుమతి లేకుండా మరోచోట వైదిక పరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ సర్క్యులర్ జారీ చేశారు. దేవాదాయశాఖలో పనిచేస్తున్న పురోహితులు, వేదపండితులు రాష్ట్రంతోపాటు రాష్ర్టేతర, విదేశాల్లో తరచుగా లోకకల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, ప్రవచనాలు, వేదసంహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని మంత్రి కొండాసురేఖ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు చెప్పారు. పురోహితులు, వేదపండితులు వేరేచోట మతపరమైన కార్యక్రమాలు చేయడంపై ఆంక్షలు విధించాలని అధికారులను ఆదేశించారు . ఆలయాల్లో పనిచేసే పురోహితులు, వేదపండితులు రాష్ట్ర, రాష్ర్టేతర, విదేశాల్లో ఎలాంటి వైదిక, మతపరమైన కార్యక్రమాలు చేయాలన్నా సీసీఎస్ రూల్స్ ప్రకారం ముందస్తు సమాచారమిచ్చి, కచ్చితంగా శాఖాపరమైన అనుమతి తీసుకోవాలని, లేకుంటే శాఖాపరంగా క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని సర్క్యులర్లో పేర్కొన్నారు.