హైదరాబాద్, డిసెంబర్14(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ప్రభుత్వంలో కొత్త చిచ్చుపెట్టినట్టు రాష్ట్ర బ్యూరోక్రాట్ల మధ్య చర్చ జరుగుతున్నది. స్పెషల్ సీఎస్ (Special CS) హోదాలో ముఖ్యనేతకు సన్నిహితంగా మెదిలే ఓ సీనియర్ బ్యూరోక్రాట్ సొంత నిర్ణయాలతో ఇటు మంత్రులను, అటు సహచర బ్యూరోక్రాట్లను ముప్పుతిప్పలు పెట్టినట్టు చర్చ జరుగుతున్నది. రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్‌లో కేవలం సదరు అధికారికే అన్ని బాధ్యతలను అప్పగించటం, ఆయనతో సమానహోదా కలిగిన వారిని పక్కన పెట్టడంపై తీవ్ర చర్చ నడుస్తున్నది. సమ్మిట్‌కు సంబంధించిన క్షేత్రస్థాయి పని, విధి విధానాల రూపకల్పన తదితర వ్యవహారాలు పరిశ్రమల శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు పూర్తి చేయగా, స్పెషల్ సీఎస్ ఫైళ్లు పట్టుకొని సమ్మిట్ వేదిక మీద ‘షో’ చేశారని ఆ బ్యూరోక్రాట్స్ ఆరోపిస్తున్నారు. తన సొంత శాఖ నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా ఆయనే హైజాక్ చేశారని ఓ స్పెషల్ సీఎస్ స్థాయి అధికారి ఆవేదన వ్యక్తం చేయగా, ఈ మేరకు సమ్మిట్‌లో ఆయన వ్యవహరించిన తీరుపై ప్రధానకార్యదర్శి రామకృష్ణరావుకు సహచర కార్యదర్శులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.
ముఖ్యనేతతో అతిసాన్నిహిత్యంగా మెదులుతున్న సదరు స్పెషల్ కొంతకాలంగా సీఎస్ చీఫ్ సెక్రటరీ కుర్చీ మీద కన్నేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణరావు పదవీకాలం మరో మూడున్నర నెలల్లో ముగియనున్నది. గత ఆగస్టుతోనే ఆయన పదవీకాలం ముగిసినా ప్రభుత్వం 7 నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. అదీ 2026 మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో సదరు అధికారి సీఎస్ సీటుపై ఆశలు పెట్టుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే గ్లోబల్ ఈవెంట్‌ను ఒంటి చేత్తో నడిపించానని సీఎం వద్ద చెప్పుకోవడం కోసం తనతో సమాన స్థాయి అధికారులను తక్కువ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సీఎస్ రామకృష్ణరావు పదవీకాలాన్ని మరో 5 నెలలు పొడగించాలనే ఆలోచనతో సీఎం ఉన్నాడని తెలిసింది. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రికి మంచి సంబంధాలే ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో పదవీకాలాన్ని పొడగించటం లాంఛనమే అని బ్యూరోక్రాట్లలో మరో ప్రచారం జరుగుతున్నది.
రెండు రోజుల సమ్మిట్‌లో మొత్తం 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించినట్టు తెలిసింది. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఆర్థికాభివృద్ధి తదితర 15 అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఆయా సెషన్లలో ఏ శాఖపై చర్చ జరిగినప్పుడు ఆ శాఖ మంత్రిని అనుమతిచ్చి, కేవలం ముగ్గురు మంత్రులకు మాత్రమే అన్నింటికి పర్మిషన్ ఇచ్చినట్టు వినికిడి. ఇలాంటి నిబంధనతో తమకు జరిగిన అవమానంపై కొందరు మంత్రులు అలిగి సమ్మిట్ నుంచి వెళ్లిపోవడమే కాకుండా ఆ స్పెషల్ సీఎస్‌పై ఆగ్రహంతో సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.