హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఉన్నతాధికారుల బదిలీలు (Officers Transfers) పరాచికంగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బదిలీ చేస్తుంటే మంత్రులేమో వారిని చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. దీంతో సొంత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులనే మంత్రులు లెక్కచేయడం లేదనే చర్చ జరుగుతున్నది. దీంతో అధికారుల బదిలీలు, నియామకాలపై సీఎం వర్సెస్ మంత్రుల మధ్య పోరుగా సాగుతున్నదని స్పష్టమవుతున్నది. తమకు అనుకూలమైన అధికారులను నియమిస్తే ఓకే.. లేదంటే నిర్మొహమాటంగా వారిని చేర్చుకునేందుకు అమాత్యులు
తిరస్కరిస్తున్నారు. ఉత్తర్వులు గిత్తర్వులు జాన్తా నై అంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఇటీవల జరిగిన బదిలీలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
పంచాయతీరాజ్‌శాఖలో సీనియర్ అధికారి అయిన జితేందర్‌రెడ్డిని సెప్టెంబర్ 16న ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి అనుమతితో ఆయనను వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న ఆయిల్‌ఫెడ్‌కు ఎండీగా నియమించింది. అయితే, ఆయన నియామకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యతిరేకించినట్టుగా వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. తనకు ఐఏఎస్ అధికారులే కావాలని పట్టుబట్టినట్టు సమాచారం. దీంతో జాయినింగ్ కోసం వెళ్లిన జితేందర్‌రెడ్డిని మంత్రి తుమ్మల నిలువరించినట్టు తెలిసింది. దీంతో ఆయన అక్కడ చేరలేదు. దాదాపు నెలన్నర ఖాళీగా ఉన్న ఆయన్ను ఇటీవల జరిగిన బదిలీల్లో షెడ్యూల్కులాల అభివృద్ధి శాఖకు కమిషనర్‌గా నియమించింది. కానీ, ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో జితేందర్‌రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీఎం మద్దతుతో పోస్టింగ్ దక్కించుకున్నా ప్రయోజనం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
మంత్రులకు తెలియకుండానే..
జితేందర్‌రెడ్డి ఉదంతంతో ప్రభుత్వంలో అధికారుల బదిలీలు, నియామకాలపై చర్చ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి స్వయంగా చూసించి నియమించిన వారిని మంత్రులు పక్కనపెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సంబంధితశాఖల మంత్రులకు తెలియకుండానే అధికారుల బదిలీలు, నియామకాలు జరుగుతున్నాయా అనే చర్చ జరుగుతున్నది. నియామకాలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రుల ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకోవడం లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో కరీంనగర్ కలెక్టర్ బదిలీ అంశంలోనూ ఇదే జరిగినట్టు తెలిసింది. పలు శాఖాధిపతుల బదిలీల్లోనూ ఆ శాఖల మంత్రులకు తెలియకుండా నియామకాలు చేసినట్టు తెలిసింది. తమ శాఖకు, తమకు తెలియకుండా అధికారులను నియమిస్తే ఎలా పని చేసేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో మంత్రులు కూడా నిర్మొహమాటంగా నియామకాలను వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది.