హైదరాబాద్/న్యూస్ నెట్వర్క్, జూలై 14 (నమస్తే తెలంగాణ): వారం నుంచి ఎడతెరిపిలేని వానలతో ప్రజలు కకావికలం అవుతున్నారు.. గోదావరి నది పరివాహక ప్రాంతమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించిన సర్కారు.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సహా సమస్త టీఆర్ఎస్ శ్రేణులన్నీ వరద సహాయక చర్యల్లో తలమునకయ్యాయి. కానీ, పొద్దునలేస్తే తామే అసలైన నాయకులమని చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీ నేతలు కంటికి కనిపించకుండా పోయారని వరద బాధితులు మండిపడుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు తమ పార్లమెంట్ పరిధిలో వరద సహాయక చర్యల్లో పత్తాలేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కలిసే సాకుతో గోవా వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారని, ఒకరిద్దరు విపక్ష ప్రజాప్రతినిధులు తప్ప మరెవరూ సహాయక చర్యల్లో పాల్గొనటం లేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు పార్టీలో తన ఆధిపత్యం కోసం ఢిల్లీలో దౌడ్ తీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘అయినవారెవరో.. కానివారెవరో ఆపదలో ఉన్నప్పుడే తెలుస్తుంది. మేం ఆపదలో ఉంటే ప్రభుత్వం, టీఆర్ఎస్ యంత్రాంగం కష్టంలో పాలుపంచుకొంటున్నది’ అని సహాయం పొందిన బాధితులు చెప్తున్నారు.
సహాయక చర్యల్లో మంత్రులు
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో గురువారం రాష్ట్ర మంత్రులు వేర్వేరుగా కలియతిరిగారు. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాల కల్పనపై భరోసా ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. అక్కడ వారికి వసతి, భోజనాల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకొన్నారు. గురువారం మంత్రులు తమతమ నియోజకవర్గాల్లో తిష్టవేసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని పరిశీలించారు. మంత్రి హరీశ్‌రావు మెదక్ జిల్లా హవేళీఘన్‌పూర్ దూప్‌సింగ్ తండాలో పర్యటించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 4 రోజులుగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ పరిస్థితిని సమీక్షించారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడ పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను, కోతకు గురైన పంట పొలాలను పరిశీలించారు.
ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలం కేంద్రంగా సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి విప్కతర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వాగులో చిక్కుకొన్న తొమ్మిది మంది ఒడిశా కార్మికులను రెస్క్యూ టీమ్స్ సాయంతో మంత్రి గంగుల కమలాకర్ సురక్షితంగా బయటకి తెప్పించారు. తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది రిజర్వాయర్ కట్ట కింద ఉన్న గంగపుత్రులు, ముదిరాజ్‌లకు చెందిన 45 ఇండ్లు వరద నీటిలో చిక్కుకోవడంతో బాధితులతో మంత్రి కొప్పుల మాట్లాడారు.
తక్షణ సాయం ప్రభుత్వం తరఫున రూ.5,200 తో పాటు, వ్యక్తిగతంగా రూ. 5,000 చొప్పున సాయం చేస్తామని హామీనిచ్చారు. ధర్మపురిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారు. చెన్నూరు నియోజకర్గం సోమన్పల్లికి చెందిన ఇద్దరిని విప్ బాల్క సుమన్ తక్షణం స్పందించి ప్రత్యేక హెలికాప్టర్లో తరలించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ, హన్మకొండ జిల్లాల్లో వరద సహాయక చర్యలను సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాగా, గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాలను పరిశీలించారు. వర్షం దాటికి దెబ్బతిన ఇండ్లను పరిశీలించి ఆయా యజమానులకు ధైర్యం చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో దారి పక్కన గల పురాతన వ్యవసాయ బావి(మైసం బావి) పూడ్చి వేత పనులను ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ ఐటీడీఏ పరిధిలోని కలెక్టర్లు, పీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు.