Congress | హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): తమ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం లీక్‌లతో తప్పుదారి పట్టించే వ్యూహం అవలంబిస్తున్నదని గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. గ్రూప్-1 వివాదంపై శనివారం రాత్రి మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ హంగామా చేశారు. హడావుడిగా రాత్రిపూట మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో గ్రూప్-1 వివాదంపై చర్చించినట్టు లీకులిచ్చారు. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ఆదివారం ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేస్తుందని, పలువురు మంత్రులు మీడియా సమావేశాలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది.
కానీ, ఆదివారం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. పీసీసీ అధ్యక్షుడితో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇప్పించారు. పార్టీ అధ్యక్షుడైన ఆయన.. ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా వత్తాసు పలికారు. అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నామని, జీవో 29తో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని మహేశ్‌కుమార్ చెప్పారు. అప్పటికే గ్రూప్-1 అభ్యర్థులు రగిలిపోతున్నారు. లాఠీచార్జితో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. మరోవైపు, ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తున్నది. దీంతో విద్యార్థులు తమ ఆందోళనలను మరింత ఉదృతం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వీరిని పక్కదారి పట్టించేందుకు, వారి ఆందోళనను విరమింపచేసేందుకు ప్రభుత్వం లీకుల వ్యూహం అవలంబించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.