హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ):రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఒకవైపు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత మరోవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తుండగా, అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు రోడ్ షోలు, కార్నర్ మీటింగులు చేపడుతున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభలకు,రోడ్ షోలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. చౌరస్తాలో పట్టలేనంత ప్రజలు తరలివస్తుండటంతో సమీప భవనాలు సైతం నిండిపోతున్నాయి. తెలంగాణ అంతటా శనివారం మంత్రులు నిర్వహించిన రోడ్ షోలు, ప్రచార సభలకు ప్రజలు పోటెత్తారు. తమ మద్దతు అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌కేనని, కారు గుర్తుకే ఓటేస్తామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.