హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): సమన్వయం.. సమరతత్వం రెండూ కలగలిసిన నేతలు వారు. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం.. జనంతో మమేకం కావడం ఆ ఇద్దరికి ఉద్యమం నుంచి అబ్బిన విద్య. రాష్ట్రంలో మరేపార్టీకి లేని ఆయుధాలు వాళ్లు. యూత్ ఐకాన్, ైస్టెలిష్ పొలిటీషియన్ అని ఒకరిని, ఆరు అడుగుల బుల్లెట్, ట్రబుల్ షూటర్ అని మరొకరిని పార్టీ శ్రేణులు ఇష్టంగా పిలుచుకొంటారు. రాష్ట్ర ప్రజలు వీరిని కృష్ణార్జునులుగా సంభోదిస్తారు. వారే ఒకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరొకరు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు. అది ఉద్యమమైనా.. ఎన్నికలైనా ఇద్దరూ బరిలో దిగితే విపక్షాలకు ముచ్చెమటలేనని అనేక సందర్భాలు నిరూపించాయి.
ఈసారికూడా కదనరంగంలోకి దూకి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను చుట్టివచ్చారు. అధినేత ఆలోచనలను కలిసికట్టుగా జనాల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేనాటికే రాష్ట్రమంతా ప్రచార సభలను నిర్వహించాలనే లక్ష్యానికి ఇప్పటికే చేరువలో ఉన్నారు. ఆగస్టు 21న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటినుంచి మంత్రులిద్దరూ రాష్ట్రంలోని 64 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చారు. మంత్రుల సుడిగాలి పర్యటనలతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా హ్యాట్రిక్ కొట్టాలన్న వజ్రసంకల్పం బీఆర్ఎస్ శ్రేణుల్లో తొణకిసలాడుతున్నది. బీఆర్ఎస్ శ్రేణుల సమరోత్సాహ ప్రదర్శనను చూసి కాంగ్రెస్, బీజేపీలు బెంబేలెత్తిపోతున్నాయి.
అధినేత ఆలోచన.. మంత్రుల ఆచరణ
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచనను అక్షరాలా కార్యాచరణలో పెడుతూ ప్రజలను సమీకరిస్తూ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు. ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే 50 నియోజకవర్గాలను చుట్టివచ్చారు. షెడ్యూల్ విడుదల తరువాత 14 నియోజకవర్గాలు ఇలా మొత్తం ఇప్పటి వరకు 64 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేశారు. చెన్నూరు వంటి నియోజకవర్గంలో వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు మంత్రులు పర్యటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, భూమిపూజల్లో పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల నిర్మాణాలకు భూమిపూజలతో మంత్రి హరీశ్‌రావు, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఐటీ పార్కుల ప్రారంభోత్సవాలు, భూమిపూజలతో మంత్రి కేటీఆర్ ఎడతెరపిలేని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు, పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఈ నెల 2వ తేదీన చెన్నూరు, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తే మంత్రి హరీశ్‌రావు ఈ నెల 6వ తేదీన మహేశ్వరం, జుక్కల్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, మానకొండూరు ఈ ఐదు నియోజకవర్గాలను చుట్టివచ్చారు.
బీఆర్ఎస్లో నయాజోష్
ఆత్మీయ సమ్మేళనాలు, 21 రోజుల దశాబ్ది ఉత్సవాలు, పోడుభూములకు అటవీ భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ, మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాలు బీఆర్ఎస్ పార్టీలో నయాజోష్ను నింపాయి. దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న విషప్రచారాన్ని నియోజకవర్గాల్లో అన్ని స్థాయిల పార్టీ శ్రేణులు ఎక్కడిక్కడ తిప్పికొడుతున్నాయి.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన ప్రగతి, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ర్టానికి పట్టిన దుర్గతిని కండ్లకు కడుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లకాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ.. సంక్షేమ ఫలాలు అనుభవించిన కుటుంబాలను నేరుగా కలుస్తూ బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారాన్ని చేపట్టాల్సిన అనివార్యతలను ప్రజలకు వివరిస్తున్నారు. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ప్రచారంలో నిజానిజాలు తమకు తెలుసని, ‘సద్దితిన్న రేవును మరువం’ అని ప్రజలు బీఆర్ఎస్కు బాసటగా నిలుస్తున్నారు.