Paddy Procurement | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు బీఆర్ఎస్ భవన్లో కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాలు అధికారులు, డీఎంలు, ఎఫ్‌సీఐ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల సంస్థ
చైర్మన్ రవీందర్ సింగ్, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషన్ అనీల్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రుతులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కొనుగోళ్లకు సిద్ధం కావాలని ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, ఇందుకు 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. యాసంగికి సీజన్ సీఎంఆర్‌ను 30వ తేదీలోగా మిల్లర్ల నుంచి సేకరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ అప్పగింత విషయంలో ఆలస్యం జరిగితే ఉపేక్షించబోమన్నారు.
ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను అప్పగించి.. ఈ సీజన్ సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు సీఎంఆర్‌లో పాల్గొనని మిల్లర్లను యాసంగి సీజన్ నుంచి భాగస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో రెండు సీజన్లో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని, 2014-15లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి రూ.26,600 కోట్లకు చేరుకుందన్నారు.
తొమ్మిది సంవత్సరాల్లో ఆరు రేట్ల ధాన్యం కొనుగోలు పెరగ్గా.. మిల్లింగ్ సామర్థ్యం రెండురేట్ల మాత్రమే పెరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఎప్పటికప్పడు ఆన్ లైన్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.