మాపై బురదజల్లుతూ నీ అనుకూల మీడియాలో ఆర్టికల్స్ రాయించినవ్! మహిళా ఆఫీసర్లను కొందరు మంత్రులు ఇండ్లకు పిలిపించుకుంటున్నరని రాయించినవ్! దీన్నిబట్టి ఏం అర్థమవుతున్నది? సొంత క్యాబినెట్ మంత్రులను ఒక సీఎం ఇంతలా బ్లేమ్ చేయడం ఏం పద్ధతి? ప్రభుత్వం పరువు తీస్తున్నది ఆయనా? మేమా? మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, మా వ్యక్తిత్వాన్ని కించపర్చేలా రోత రాతలు ఎందుకోసం రాయించుకున్నరు?’
తెలంగాణ.. ఆత్మగౌరవం గల్ల నేల. అంజయ్యను రాజీవ్‌గాంధీ అవమానిస్తే.. అదే కాంగ్రెస్‌ను ఓడగొట్టిందీ ప్రజలే. అలాంటి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. వారిని ఈ ఆత్మగౌరవ నేలకు ప్రతినిధిగానే చూడాలి. కానీ, అది తెలంగాణ మనోభావాలు పట్టని ఢిల్లీ పార్టీ! అందునా కాంగ్రెస్! తెలంగాణ సీఎం రేవంత్‌తో కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు అమర్యాదకరంగా ఉన్నది. శనివారం ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల్ని రేవంత్ కలిసినప్పటి ఫొటోలో.. ఒక ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ కాలు మీద కాలు వేసుకుంటే, కుర్చీ అంచున కూర్చొని వివరణ ఇచ్చుకునే స్థితిలో సీఎం రేవంత్ ఉండటం కనిపిస్తున్నది. మీడియాకు విడుదల చేసే ఫొటోల్లోనే ఇలా ఉంటే.. మరి కెమెరాలు లేనప్పుడు ఎలా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు? ఒక సీఎంగా తనను తాను ఫోకస్ చేసుకోవడంలో రేవంత్ విఫలమయ్యాడా? కాంగ్రెస్ నేతకు మించి ఆయన స్థాయి ఏమాత్రం ఎదగలేదని అధిష్ఠానం భావిస్తున్నదా?
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల మధ్య వ్యవహారం ముదిరిపాకాన పడ్డదా? ఇన్నాళ్లూ లోగుట్టుగా సాగుతున్న మనస్పర్థలు, విభేదాలు ఇప్పుడు క్యాబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయా? మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతున్నదా? మంత్రులు ఒక వైపు, సీఎం మరొక వైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఇది ఒకరినొకరు ప్రత్యక్షంగా విమర్శించుకునే స్థాయికి, పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసుకునే స్థాయికి వెళ్లిందా? తన పరిపాలనా వైఫల్యాలను మంత్రుల మీదికి నెట్టడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిలు వేశారా? మంత్రివర్గ భేటీ అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ మంత్రులు ఏకమై తలంటడంతో షాక్ తిన్న సీఎం, విషయం బయటికి పొక్కితే పరువు పోతుందని ఎల్లో పత్రికల్లో ఉల్టా రాయించుకున్నారా?
తానే మంత్రులకు తలంటినట్టు గొప్పలకు పోయారా? తన మనిషిగా గుర్తింపు పొందిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా సీఎం తీరుతో విసిగిపోయారా? అంటే రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. తన గురువు సన్నిహిత పత్రికలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వైఫల్యాలు మూటగట్టుకున్న రేవంత్‌రెడ్డి తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం తమ ఇమేజ్‌కు మసి పూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని, తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎల్లో పత్రికలో రాతలు రాయించడంపై నిప్పులు కక్కుతున్నారు.
‘రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే అది ఇష్టమున్నట్టు మాట్లాడుతుండటంతో జనంలో ఆయ పలుచన అవుతున్నరు. అని ఎల్లో పత్రికలో రాయించుకున్నరు. వాస్తవానికి ఆయన చేష్టలవల్లే పార్టీ, ప్రభుత్వం పరువు పోతున్నది’ అని ఓ సీనియర్ మంత్రి అహసనం వ్యక్తంచేశారు.
‘మంత్రులు ఎవరికి వారు సర్వ స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఆ శాఖ, ఈ శాఖ అని లేకుండా అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారు. కలెక్టర్లకు నేరుగా ఫోన్లు చేస్తూ మర్యాద ఇవ్వకుండా ఇతర శాఖలకు సంబంధించిన అంశాల్లో ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇళ్లకు పిలిపించుకుంటున్నారు. రాష్ర్టానికి ఒక్కరే ముఖ్యమంత్రి ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకుంటున్నారు.. అని ఆ పత్రికలో రాసిండ్రు. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? సొంత క్యాబినెట్ మంత్రులనే ఒక ముఖ్యమంత్రి ఇంత బ్లేమ్ చేయడం ఏం పద్ధతి? మహిళా అధికారులను ఇళ్లకు పిలిపించుకుంటున్నారు అంటే ఏమన్నట్టు? ప్రభుత్వం పరువు తీస్తున్నది ఆయనా? మేమా? మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని, మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఇలాంటి రోత రాతలు ఎందుకోసం రాయించుకున్నరు?’ అని ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఆక్రోశం వెలిబుచ్చారు.

‘పరిపాలన పరుగులు పెట్టించేందుకు గరిష్ఠంగా 6 నెలల కాల వ్యవధి చాలు. కానీ అధికారంలోకి వచ్చి 22 నెలలైంది. ఏం సాధించామని? అదును మీద బస్తెడు యూరియా కూ డా అందించలేక రైతుల ముందు దోషులుగా నిలబడ్డం. పల్లెలకు పోతే తులం బంగారం ఏదని నిలదీస్తున్నరు. రూ.2500 హామీ ఏమైందని అడుగుతున్నరు. రేవంత్ ఏ పని పట్టుకున్నా వైఫల్యమే. బ్యూరోక్రాట్లు వీఆర్ఎస్ తీసుకునే వరకు పరిస్థితి తీసుకువచ్చారు.. వద్దంటే కాళేశ్వరం వెంట పడ్డారు. కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టాలనే ఆలోచనతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. అది కరెక్టు కాదు, వ్యక్తిగతంగా కేసీఆర్ మీద మీరు కోరుకున్నంత వ్యతిరేకత ప్రజల్లో లేదు, ప్రజల మద్దతు లేని పనులతో అబాసుపాలై పోతమని చెప్పేందుకు ప్రయత్నిస్తే నేను కేసీఆర్ కోవర్టుగా పని చేస్తున్నట్టు నన్నొక దోషిగా చూసిండ్రు’ అని ఓ కాంగ్రెస్ సీనియర్ మంత్రి వాపోయారు.
‘తోటి మంత్రులంటే లెక్క లేదు.. సమావేశంలో మాట్లాడి తీసుకునే నిర్ణయాలు ఒకటైతే.. బయటికి వచ్చే ఉత్తర్వులు మరోటి ఉంటయి.. చిన్నతనంలోనే మంచి అవకాశం వచ్చింది, పార్టీని, ప్రభుత్వాన్ని విజయపథంలో నడిపించాలని ఒకటికి పదిసార్లు చెప్పి చూసినం. అయినా ఆయనలో మార్పు రాలేదు. భవిష్యత్తులో కూడా మారుతారనే నమ్మకం లేదు’ అని అసహనం వ్యక్తంచేశారు. ‘మనిషిలో పరివర్తనం ఉండాలే తప్ప కిందపడ్డా నాదే పై చెయ్యి అని చెప్పుకునేందుకు తాపత్రయపడే మనిషితో ప్రయాణం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడం వంటిదే’ అని ఓ మంత్రి చురకలంటించారు.
‘16 మంది మంత్రుల్లో ఏ ఇద్దరి మధ్యా సమన్వయం లేక అంతర్గత ఘర్షణలు బహిర్గతమవుతున్నాయని పార్టీ కార్యకర్తల్లో ఆందోళన ఉన్నది. కానీ పార్టీ లీడర్‌గా ఇప్పటి వరకు బాధ్యతాయుతంగా ప్రవర్తించారా? రానురాను పార్టీ పతనమై పోతున్నది. ఇప్పుడు మాట్లాడకుండా ఇంకెప్పుడు మాట్లాడలేం.. పార్టీ అధికారంలోకి రావాలని శపథాలు చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్లం. అధిష్ఠానం ఆదేశాలు శిరసావహించి ముఖ్యమంత్రి పీఠాన్ని గౌరవించినం. వారిది ఏమున్నది? ఈ పుట్టి మునిగితే , మంచినీళ్లు తాగినంత సులువుగా ఇంకో పుట్టిలో కాలు వేస్తరు’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. ‘సీఎం అయిన దగ్గర నుంచి ఈ నాటి దాకా రేవంత్ వేసే ప్రతి అడుగు బీజేపీకి దగ్గరగానే పడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ మోదీని కలుస్తున్నరు. లేదంటే బీజేపీ మంత్రులను కలుస్తూ మా పార్టీ అధిష్ఠానాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నరు. ఈ రోజు రేవంత్‌ను కాదంటే ప్రభుత్వమే కూలిపోతుందని రాయించుకొని అధిష్ఠానాన్ని బెదిరించాలనుకుంటున్నరు. రేవంత్ దిగిపోతే కాంగ్రెస్ నిలబడుతదా? ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడుతదా? లేదా? అన్నది తేలుతది’ అని ఆ నేత సవాల్ చేశారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి అనుభవ రాహిత్యం, ఆకతాయితనంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంప మునిగింది’ అంటూ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు రగిలిపోతున్నారు. ఇప్పుడు రంగంలోకి దిగి జరిగిన నష్టాన్ని పూడుద్దామన్నా పూడ్చలేనంత అగాధంలో ప్రభుత్వాన్ని పడేసిండ్రు’ అని తలపట్టుకుంటున్నారు. ‘రేవంత్ స్వయంకృతాపరాధంతో పోగొట్టుకున్న ఇమేజ్ను ఎల్లో మీడియా పెయిడ్ అర్టికల్స్‌లో దేవులాడుకుంటున్నారు. ఆయన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం మా ఇమేజ్‌కు మసి పూయలేరు’ అని ఓ సీనియర్ మంత్రి హెచ్చరించారు. ‘పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఒప్పుకున్న ఆ పత్రిక ప్రభుత్వ నేతగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఎందుకు రాయలేకపోయింది’ అని నిలదీశారు.
‘ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ అన్న ప్రచారం చాపకింద నీరులా సాగుతోంది. ప్రభుత్వపరంగా తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కూడా మంత్రులు తమకు సంబంధం లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అనుభవరాహిత్యంతో రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ప్రచారం చేస్తున్నారట! అని మామీద దుష్ప్రచారం చేయడం ఎందుకు? అసలు మా శాఖలో మాకే తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటూ పైగా మామీదనే ఉల్టా ప్రచారం చేయడం ఎవరిని బద్నాం చేసేందుకు?’ అని ఓ సీనియర్ మంత్రి వాపోయారు.
ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కుతున్నారని, రహస్య సమావేశాలు, రెస్టారెంట్లలో మంతనాలు జరుపుతున్నారని, పార్టీ మీద, ప్రభుత్వం తీరు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరు కుంపటి పెట్టుకున్నారని, ప్రభుత్వానికి ప్రతిపక్షంగా వాళ్లే తయారైనా పార్టీ లీడర్‌గా ఆయనకు ఏమైనా పట్టింపు ఉన్నదా ? అని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ పోలీసు అధికారుల మీద హౌస్ మోషన్లు, కోర్టుల్లో పిటిషన్లు వేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ఎమ్మెల్యేలను కట్టడి చేసి, పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటిపై నడిపేందుకు రేవంత్ చేసిన ప్రయత్నం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘మంత్రులకు, బ్యూరోక్రాట్ల మధ్య సఖ్యత ఉన్నదా? మంత్రులు చెప్పిన మాట ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వింటున్నరా? ఈ పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? ప్రతి శాఖలో మీకు సంబంధించిన హెచ్వోడీలను చొప్పించి వ్యవహారాలు నడిపిస్తుంటే మేం సమాచార హక్కు చట్టం కింద ఫైళ్లు తెప్పించుకునే దుస్థితి తెచ్చింది మీరుకాదా?’ అని మరో మంత్రి మండిపడ్డారు. ‘సీఎంగా ఆయన మాకు ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చారు? ఎమ్మెల్యేలకు నిధులివ్వకుండా ప్రజల్లో వాళ్లను డమ్మీలను చేసి మళ్లీ గెలవకుండా చేసింది ముఖ్యమంత్రి కాదా? ఇన్ని మరకలు కుర్చీ కింద పెట్టుకున్న సీఎం గురివింద రాతలు రాయించుకున్నంత మాత్రాన మా ఇమేజ్‌కు వచ్చే నష్టమేం లేదు’ అని మంత్రులు బహిరంగంగానే తేల్చిచెప్తున్నారు.
‘కొంతమంది మంత్రులైతే రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా కూడా గుర్తించడానికి ఇష్టపడటం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ పుట్టి మునగడంతో పాటు తాను కూడా మునిగిపోతానని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా తాను ఫెయిల్యూర్ అన్న ముద్ర వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను రేవంత్‌రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని ఎల్లో పత్రిక రాసింది. ఇది రేవంత్‌ను వెనకేసుకొస్తూ ఎల్లో మీడియా రాసిన పెయిడ్ ఆర్టికల్ అని చదివిన వాళ్లందరికీ అర్థమవుతుంది. తన స్వయంకృతాపరాధంతో పోగొట్టుకున్న ఇమేజ్ను ఇట్లా పేపర్లలో అర్టికల్స్ రాయించి దేవులాడుకుంటే రాదు’ అని ఓ అసంతృప్త మంత్రి నిప్పులుచెరిగారు.
క్యాడర్ నుంచి లీడర్ దాకా విరామం లేకుండా పుట్టుకొస్తున్న వివాదాలు రేవంత్‌లో నాయకత్వ సామర్థ్యలేమిని బయట పెట్టాయని, దాన్ని కప్పి పుచ్చుకోడానికి ఎల్లో మీడియా కథనాలతో తామేదో తప్పు చేస్తున్నట్టు, తలంటినట్టు ప్రజలకు చెప్పాలనుకున్నా, తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతామన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
‘మేమేమైనా షాడో మంత్రి వర్గ కార్యాలయాలు నడిపిస్తున్నమా? ఎక్కడైనా సెటిల్మెంట్లు చేసినమా? ఏం చేస్తే తలంటినట్టు రాయించుకున్నవు?’ అని ఓ సీనియర్ మంత్రి సీరియస్ అయ్యారు. ‘హద్దుమీరి వ్యవహరిస్తున్నమంత్రులపై చర్య తీసుకోవడానికి వెనుకాడనని రేవంత్‌రెడ్డి హెచ్చరించారట! నిజంగానే రేవంత్‌కు కోపం వస్తే కొండా సురేఖపై ఎందుకు చర్యలు తీసుకోలేదో? ఎవరు వద్దంటే ఆగిపోయారో? బాబు బంటు చెప్పాలి’ అని వారు డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణలు కేవలం దూషణలు కాదని, మంత్రుల మధ్య టెండర్ల పంచాయితీ, ముఖ్యమంత్రి సోదరుల భూదం దా గురించి చెప్పిన నిజాలు అని, ముఖ్యమంత్రి తన నిజాయితీని నిరూపించుకొనేందుకు సుస్మిత చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని ఎందుకు రాయలేదని, సుస్మిత చెప్పిన నిజాలు బయటపెడితే.. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తే.. ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం మొత్తం బయటపడుతుందని బాబు బంటు భయపడ్డారా? అని పలువురు కాంగ్రెస్ సీనియర్లు నిలదీశారు.
గురువారం నాటి క్యాబినెట్ భేటీ అనంతరం ఫక్తు మంత్రివర్గమే కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలిసింది. అధికారులను బయటికి పంపిన తరువాత సీఎం రేవంత్‌రెడ్డి మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ‘సీనియర్లు అని స్వేచ్ఛనిస్తే మీరు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.. నన్నొక విఫల ముఖ్యమంత్రిగా చూపించాలని మీరు ప్రయత్నిస్తున్నారు’ అని కోపానికి వచ్చినట్టు సమాచారం. సీఎం మాటలకు ఓ మంత్రి మధ్యలోనే అడ్డం పడుతూ ‘ముఖ్యమంత్రి గారూ.. ఇది క్యాబినెట్ భేటీ.. వ్యక్తిగత వివాదాలతో ఇప్పటికే పత్రికలకు ఎక్కినం. క్యాబినెట్లో జరిగిన చర్చ మీద ప్రమాణం వరకు వెళ్లింది. మళ్లీ అదే చర్చ అంటే బాగుండదు’ అని తలంటినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మంత్రి మాటలకు ప్రతిగా సీఎం స్పందిస్తూ ‘మీడియాకు మన వాళ్లే లీకులిస్తున్నరు. రాత్రి వరకు జరుగుతున్న సమావేశాల సమాచారం కేసీఆర్ పత్రికకు ఎవరు చెప్తున్నరు? మీరు, మీతో పాటు కొందరు ఎమ్మెల్యేలు మల్లికార్జున ఖర్గేను కలిశారు.
ఆయన నా మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా నన్ను ఒక విఫల సీఎంగా చూస్తున్నరని మీ అంతట మీరే రాయించుకొని మీడియాకు లీకులిచ్చారు’ అని గుడ్లురిమినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద ఒకింత అసహనానికి గురైన సదరు మంత్రి ‘నాతో పాటు ఎమ్మెల్యేలు వచ్చారు. బయటికి వచ్చాక ఎవరేం చెప్పారో నాకెలా తెలుస్తది?’ అని సీరియస్ అయినట్టు తెలిసింది. వ్యక్తిగత చర్చలు మరో వేదిక మీద మాట్లాడుకుందామని ఆ మంత్రి మరోసారి సలహా ఇచ్చినట్టు సమాచారం. అనంతరం రవాణా శాఖలో చెక్‌పోస్టుల ఎత్తివేత అంశం మీద సంబంధిత మంత్రి మాట్లాడుతూ ‘చెక్‌పోస్టుల్లో అవినీతి జరుగుతున్నది.. వాటిని ఎత్తివేయాలని మొదట సూచించిందే నేను.. కానీ చెక్‌పోస్టుల రద్దుకు ముందు రోజు ఏసీబీ దాడులు చేయడం ఎందుకు? మరుసటి రోజు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వ డం ఏమిటి? మీరు నన్ను అసమర్థునిగా నిలబెట్టాలని చూస్తున్నారా?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. అక్కడి నుంచి సబ్జెక్టు మరో మంత్రి మీదికి మళ్లినట్టు తెలిసింది.
‘ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్ వరకు వెళ్లడం ప్రభుత్వానికి అతి పెద్ద నష్టం.. దీని ప్రభావం జాతీయ స్థాయిలో కాం గ్రెస్ మీద పడుతుంది’ అని సహచర మంత్రు లు ఆందోళన వ్యక్తం చేయగా సంబంధిత మంత్రి వివరణ ఇస్తున్న సమయంలో మరో సీనియర్ మంత్రి కల్పించుకొని ‘అధికారుల నుంచి పనులు తీసుకునే పద్ధతిపై మనం ఒకసారి పునఃసమీక్షించుకోవాలి’ అని సూచించినట్టు తెలిసింది. ‘బీసీ మంత్రులం అయ్యా అప్పా అని బతిమిలాడుకొని పని చేయించుకుంటున్నం. కానీ రెడ్డి, వెలమ మంత్రులే వాళ్ల మెడ మీద కత్తి పెట్టి పని చేయించుకుంటున్నరు’ అని బీసీ మంత్రి ఒకరు అన్నట్టు తెలిసింది.
బీసీ కోటా మీద ఆచితూచి పోవాలని మొత్తుకున్నం ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమ లు మీద ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన బీసీ బిల్లుల మీద కేంద్రస్థాయిలో ఒత్తిడి అవసరమని మొదటినుంచీ మొత్తుకున్నం. వినకుండా అర్డినెన్స్ అని పెడితివి. సుప్రీంకోర్టు ఉత్వర్వులను ఎత్తేసే అధికారాలు రాష్ర్టాల అసెంబ్లీకి ఉన్నదా? రిజర్వేషన్ల మీద 50 శాతం పరిమితి ఎత్తేసే జీవో తీసుకు రావొ ద్దు, అది చెల్లుబాటు కాదు అని చెప్పినం. బీసీ కమిషన్, ఎలక్షన్ కమిషన్ వద్దనే చెప్పింది. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కూడా పతాక శీర్షికన కథనాలు రాసింది. ఇదేం పట్టకుండా 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తూ జీవో ఇచ్చినవు. కోర్టు అడ్డం పడేసరికి ఇప్పుడు మీకు మంత్రులు గుర్తుకు వస్తున్నరా?’ అని ఓ బీసీ మంత్రి నిలదీశారు.
‘ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి కూడా తన పోకడలను కొంత మార్చుకోవాలి. ప్రభుత్వ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం, అవగాహన ఉండే మంత్రులు, శాసనసభ్యులతో చర్చలు జరపాలి అని ఎల్లో పత్రికలోనే రాసిండ్రు. అంటే రేవంత్‌రెడ్డి ఒంటెత్తుపోకడ పోతున్నట్టు ఒప్పుకొన్నట్టే కదా? ప్రభుత్వంలో మంత్రులను కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది వాస్తవమే కదా? ఆయనకు మద్దతుగా రాయించుకున్నదాంట్లోనే అసలు విషయం బయటపడిందా? లేదా?’ అని ఓ మంత్రి నిలదీశారు.