బెడిసికొట్టిన మంత్రి వ్యూహం!
కాంగ్రెస్ పార్టీలో ఏకంగా ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరైనా పోటీపడుతారు. ఆర్థికంగా బలంగా ఉండి, అధిష్ఠానంలో అండగా ఉండేవాళ్లుంటే చాలు. అలాంటి వారికి ఆ పదవి అందని ద్రాక్ష ఏమీకాదు.
- ముఖ్య పదవిని ఆశిస్తే అసలుకే మోసం
- ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నేతతో సంప్రదింపులు జరిపిన అమాత్యుడు
- సమాచారం తెలిసి ముఖ్యనేత అప్రమత్తం
- అప్పటినుంచే మంత్రి అధికారాలకు కత్తెర
- తాజాగా ఫైల్ రిజెక్ట్ చేసిన ముఖ్యనేత
- అప్పటినుంచే మంత్రి, ఎంపీ అంతర్మథనం
- భవిష్యత్తు కోసం పార్టీ మారే యోచన
‘ఆర్థికంగా బలముంది.. హైకమాండ్‌లో అండ ఉన్నది..’ అని ముఖ్యనేత పదవికోసం ఓ మంత్రి పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. ఢిల్లీలో మంత్రాంగం గురించి తెలిసి అప్రమత్తమైన ముఖ్యనేత.. మంత్రి అధికారాలకే కత్తెర పెట్టారు. తనను దూరంపెట్టారని అర్థమైన సదరు మంత్రి, ఓ ఎంపీతో కలిసి ఇప్పుడు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఏకంగా ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరైనా పోటీపడుతారు. ఆర్థికంగా బలంగా ఉండి, అధిష్ఠానంలో అండగా ఉండేవాళ్లుంటే చాలు. అలాంటి వారికి ఆ పదవి అందని ద్రాక్ష ఏమీకాదు. ఇప్పుడు రాష్ట్రంలోని ఓ కీలక మంత్రి ఇదే వ్యూహంతో ముందుకెళ్లారు. ముఖ్యనేత అలర్ట్ కావడంతో ఆ మంత్రి వ్యవహారం బెడిసికొట్టింది. ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నిస్తే సొంత శాఖలోనే మాట నెగ్గకుండా అవుతున్నది.
సొంత ప్రభుత్వంలో స్వలాభం కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ దశలోనే భారీగా నిధులొచ్చే అవకాశం ఉన్న ఓ ఫైల్‌ను పంపితే ఆ ముఖ్యనేత తిరస్కరించాడు. ఫలితంగా శాఖలో, పార్టీలో, సొంతంగా.. ఉపయోగం లేని చోట ఉండటం ఎందుకనే ఆలోచనకు ఆ మంత్రి వచ్చారు. మంత్రితోపాటు ఓ ఎంపీ ఇదే ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆ కీలక మంత్రికి దశాబ్దాలుగా అధికార కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నేతలతో పరిచయాలు ఉన్నాయి.
అదే పరిచయాలతో కాంగ్రెస్ అధిష్ఠానంలోని ఓ కీలక నేతకు దగ్గరయ్యారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యనేత వ్యవహారశైలి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసే అ అధిష్ఠానం కీలకనేత మాట సాయం చేస్తానని సదరు మంత్రికి హామీ ఇచ్చారు. ఆ మంత్రి అర్థికంగా బలంగా ఉండటంతో ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని గట్టిగానే ప్రయత్నించారు. పెద్ద పదవి కోసం మంత్రి చేస్తున్న ఆ ప్రయత్నాలు ముఖ్యనేతకు తెలిశాయి. వెంటనే అలర్ట్ అయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు తానే పార్టీలోకి ఆహ్వానిస్తే ఇప్పుడు తన పదవికే ఎసరు తెచ్చేలా వ్యవహరించడం ముఖ్యనేతకు ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి మంత్రిని అన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టేలా ముఖ్యనేత వ్యవహరించడం మొదలుపెట్టాడు.
మంత్రి మాట చెల్లకుండా చేసిన వైనం
ఆ కీలక మంత్రి ప్రాతినిధ్యం వహించే జిల్లాలో, పలుకుబడి ఉన్న పక్క జిల్లాలోనూ ప్రభుత్వపరంగా, పార్టీపరంగా ఆయన మాట చెల్లుబాటు కాకుండా ముఖ్యనేత కట్టడి చేశాడు. మంత్రితోపాటు ఎంపీ నియోజకవర్గంలోనూ ఇదే విధానం అమలు చేయడం మొదలుపెట్టాడు. అధికార పార్టీ వారు మంత్రితో, ఎంపీతో కలిసి వెళ్లలేని పరిస్థితిని కల్పించారు. పెద్ద పదవి కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో కొన్నిరోజులు ఆ మంత్రి స్తబ్దుగానే ఉన్నారు. రెండు, మూడుసార్లు ముఖ్యనేతను కలిశారు.
అంతా సాధారణమైందని భావించి.. భారీగా లబ్ధి చేకూర్చే ఓ ఫైల్‌ను ఇటీవలే ముఖ్యనేత వద్దకు పంపించారు. ఇప్పటికే ఆర్థికంగా బాగా స్థిరపడిన ఆ మంత్రికి ఆ ఫైల్‌ను ఆమోదిస్తే మరింత బలోపేతం అవుతారని భావించిన ముఖ్యనేత ఆ ఫైల్‌ను తిరస్కరించారు. ఈ పరిణామాలతో మంత్రి ఆలోచనలో పడ్డారు. ఎన్నిరోజులు ఉన్నా పరిస్థితిలో మార్పు ఉండదని, ప్రభుత్వపరంగా లాభం ఉండదని భావిస్తున్నారు. ఎంపీతో కలిసి మరో జాతీయ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
పార్టీ క్యాడర్‌ను కట్టడి చేసిన ముఖ్యనేత
సదరు మంత్రి, ఎంపీ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో కాంగ్రెస్ క్యాడర్ వారి వద్దకు వెళ్లకుండా ముఖ్యనేత కట్టడి చేశారు. ఎంపీ ఇటీవల నియోజకవర్గంలో పర్యటించే సమయంలోనూ కాంగ్రెస్ శ్రేణులెవరూ వారి వెంట వెళ్లనేలేదు. ఇదే దశలో మంత్రి, ఎంపీ ఇద్దరూ మరో జాతీయ పార్టీకి దగ్గరవుతున్నారని.. వారితోనూ మరో జాతీయ పార్టీ నేతలే ఉంటున్నారనే చర్చ జరుగుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడి కుటుంబం పరామర్శ కోసం ఎంపీ ఇటీవల వెళ్లారు. సమాచారం లేకుండా ఎంపీ రావడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరామర్శలో మంత్రి వెంట వెళ్లిన ఒకరిద్దరు కాంగ్రెస్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామాలతో పార్టీ మార్పుపై మంత్రి, ఎంపీ తీవ్రంగా యోచిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌లో తమకు మనుగడ ఉండదని, ప్రభుత్వంలో ఉన్నా ఎలాంటి ప్రాధాన్యం దక్కదని గట్టిగా భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయంగా భవిష్యత్తు కోసమైనా పార్టీ మార్పు అనివార్యం అని ఆ ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్టు వారి సన్నిహితులే చెప్తున్నారు.
కాంగ్రెస్‌లో భవిష్యత్తు లేదు
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేస్తే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని ఆ కీలక మంత్రి, ఎంపీ భావిస్తున్నారు. తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో అధికార పార్టీ తరఫున గెలువడం అసలే సాధ్యం కాదని ఆ ఇద్దరూ ఇప్పుడే నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. గతంలో వివిధ పార్టీలు మారిన అనుభవం ఉండటంతో అనుచరులను మార్పు కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి, ఎంపీ తమ నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలతో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉండవని, పార్టీ మార్పుతోనే తమకు భవిష్యత్తు బాగుంటుందని సన్నిహితులైన ముఖ్యనేతలకు ఆ ఇద్దరూ సూచించినట్టు తెలిసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు మరో రెండేండ్లు ఉన్న నేపథ్యంలో పార్టీ మార్పుపై ఇప్పుడే తొందరొద్దని వారికి కొందరు నచ్చచెప్తున్నారు. పదవులు, ఇతర ప్రయోజనాల ఆధారంగా రాజకీయ మార్పు నిర్ణయాలు తీసుకొనే మంత్రి.. తాజా పరిస్థితుల్లో మరోసారి మార్పుపై ఎప్పుడు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

