హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని, అది కూలిపోయిందని రెండున్నరేండ్లు పండబెట్టి, ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించి రైతులకు సాగు నీళ్లు అందిస్తే.. తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ హీరో అవుతారని రాష్ట్ర క్యాబినెట్ ఆందోళన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి బలమైన ఎజెండాగా పనిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో.. వ్యూహం లేకుండా వ్యవహరించామని, ఇప్పుడది తమ మెడకే చుట్టుకునే కాడికి వచ్చిందని ముఖ్యమంత్రిని ఉద్దేశించి మంత్రులు అన్నట్టు తెలిసింది.
ఇప్పటికిప్పుడు సుప్రీకోర్టుకు వెళ్లి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలన్న నిర్ణయం కూడా తెలివితక్కువ పనే అవుతుందని, పీసీ ఘోష్‌ను ఎక్కువగా అంచనా వేసుకొని ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయామని మంత్రులు అన్నట్టు తెలిసింది. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 22 అంశాలను మంత్రివర్గ ఎజెండాగా పెట్టినప్పటికీ అవన్నీ
పక్కకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు, ఆర్టీసీ సమ్మె, గచ్చిబౌలి స్టేడియం భూములను ప్రైవేట్‌కు అప్పగించటం అనే అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది.
వాస్తవానికి గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మహ్మద్ అజారుద్దీన్, ముద్దసాని కోదండరాంరెడ్డి పేర్లను మరోసారి క్యాబినెట్ ఆమోదంతో గవర్నర్‌కు ప్రతిపాదించడం, గచ్చిబౌలి ఇండో ర్ స్టేడియంలో దాదాపు 64 ఎకరాల భూమిని ప్రైవేట్‌కు ధారాదత్తం చేయటం కోసం క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేసినట్టు తెలిసింది.
అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక మీద ప్రభుత్వం ఊహించని విధంగా హైకోర్టు తీర్పు రావ టం, తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ పెట్రోలు పోసుకొని ఒంటికి నిప్పు అం టించుకోవటం, నల్లగొండలో వెంకన్న అనే డ్రైవర్, భద్రాచలంలో లింగారెడ్డి అనే డ్రైవర్ కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించటంతో ఎజెండా అం శాలు పక్కకుపోయి ఈ రెండు అంశాలే చర్చకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7.30 వరకు దాదాపు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో ఎక్కువ సమయం చర్చ కాళేశ్వరం మీదనే జరిగినట్టు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద వ్యూహం లేకుండా తడబడ్డామని, కేసీఆర్ లక్ష్యంగా తప్పటడుగు వేశామని దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రి ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్నికల ఎజెండాగా పెట్టడంతో సక్సెస్ అయ్యాము కానీ, అధికారంలోకి వచ్చాక వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయామని అన్నట్టు తెలిసింది.
ప్రాజెక్టు కూలిపోయిందని, ఇక పనికిరాదని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి పొరపాటు చేశామని అన్నట్టు తెలిసింది. ఘోష్ కమిషన్ నివేదిక కేవలం రూ.7,500 కోట్లు మాత్రమే వృథా అయినట్టు నివేదించిందని గుర్తుచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందా? లేక రూ.7,500 కోట్ల అవినీతి జరిగిందా? అన్నదానిపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, సీబీఐ కూడా ఇవే వివరాలు అడుగుతున్నదని సదరు మంత్రి క్యాబినెట్ సమావేశంలో అన్నట్టు తెలిసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ వేద్దామని ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిసింది. దీనిపై అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న మంత్రివర్గం.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే తొందరపాటు వద్దు అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పూర్తిగా ఇరుక్కుపోయామని, అక్కడ కూడా ఇదే తరహా తీర్పు రావచ్చని అనుకున్నట్టు తెలిసింది.
దీనిపై సబ్‌కమిటీ వేసిన తరువాతే ఏం చేయాలనే నిర్ణయానికి రావాలని మంత్రులు అనుకున్నట్టు తెలిసింది. కోర్టుకు వెళ్లటం కంటే ఢిల్లీ వెళ్లి సీబీఐ విచారణ కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని భావించినట్టు తెలిసింది. లక్ష కోట్ల అవినీతా? లేక రూ.7,500 కోట్లు వృథానా? అనే సమగ్ర సమాచారం లేకుండా సీబీఐ కూడా విచారణకు అంగీకరించదని, ఆ రకంగా నెపం కేంద్రం మీద పెట్టి నెట్టుకురావచ్చని సమావేశంలో అనుకున్నట్టు తెలిసింది.
‘కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లోపాలను సరిచేసి పునరుద్ధరించాలనేది అనాలోచిత నిర్ణయమని ముగ్గురు మంత్రులు తప్పుపట్టినట్టు తెలిసింది. హడావుడిగా మేడిగడ్డకు వెళ్లి లోపాలను సరిదిద్దటంలో ఎలా ముందుకు వెళ్లాలో ఒక స్పష్టత వచ్చిందంటూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించటం మరో తప్పిదం అని దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రి అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
కాళేశ్వరం కట్టడం జరిగింది.. కూలిపోవటం జరిగింది.. రూ లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఇంతకాలం చెప్పి, ఇప్పుడు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించి, రైతాంగానికి సాగునీరు అందిస్తే.. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ హీరోగా నిలబడుతారని అన్నట్టు సమాచారం. ఇంతకాలం కావాలని ప్రాజెక్టును పండబెట్టారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు మనంతట మనమే బలం చేకూర్చినట్టు అవుతుందని ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రులు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది.