హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బుల పంపిణీకి తెరతీశారు. సీఎం వచ్చి ప్రచారం చేసినా ఓటర్ల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బుల పంపిణీతో ప్రలోభాలకు సిద్ధమయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ డబ్బుల పంపిణీకి చర్యలు తీసుకుని వెళ్తున్నారు. బహిరంగంగా కాంగ్రెస్ ముఖ్యనేతలంతా సమావేశమై డబ్బుల సంచులను పంపిణీకి తీసుకెళ్తుంటే ఎన్నికల కమిషన్ అధికారులు ఏం చేస్తున్నారని జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇండ్లలో అకారణంగా తనిఖీలు చేయడానికి వస్తున్న అధికారులు, వందలాది మంది పోలీసులు.. కాంగ్రెస్ అరాచకాలను ఎందుకు అడ్డుకోవడంలేదని నిలదీస్తున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు నిద్రపోతున్నారా? అంటూ మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్ అడ్డగోలుగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుంటే ఈసీ అధికారులు, పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీలోని కాంగ్రెస్ నాయకుడు సీఎన్ రెడ్డి ఇంట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ మల్లు రవి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్చార్జులు సమావేశమయ్యారు. కార్లలో తీసుకొచ్చిన డబ్బుల మూటలను డివిజన్ల వారీగా పంచేందుకు ఆయా ఇన్ఛార్జులకు అందజేశారు. వారంతా డబ్బుల సంచులతోనే బయటకు వచ్చి.. కార్లలో యథేచ్ఛగా వెళ్లిపోయారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ఒక్క అధికారి కానీ, పోలీసులు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. అక్కడున్న ప్రజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నా ఎన్నికల అధికారులు స్పందించడం లేదు. గుర్తుతెలియని వ్యక్తి ఫిర్యాదు చేశారంటూ ఎన్నికల కోడ్ వర్తించని కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. కానీ.. బహిరంగంగా వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా పోలీసులు నిద్ర పోతున్నారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బుల కట్టలతో బయటకు వస్తున్నారని సమాచారం రావడంతో.. ఆ విషయం చిత్రీకరించి, ప్రజలకు చూపేందుకు టీన్యూస్ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డు మీద నిలబడి ఈ తతంగమంతా చూస్తుండగా కొంత మంది కాంగ్రెస్ గూండాలు.. రంగంలోకి దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని టీన్యూస్ బృంద సభ్యులను బెదిరించారు. కానీ టీన్యూస్ ప్రతినిధులు ప్రతిఘటించడంతో ఫోన్లు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఎందుకొచ్చారంటూ దౌర్జాన్యానికి పాల్పడారు.