హైదరాబాద్, జూలై 9 (నమస్తేతెలంగాణ): ‘నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే రాజు.. ఆ రాజుకు మంత్రుల సహాయం అవసరమైతే చేసి పెడతాం’ అని కార్మికశాఖ మంత్రి జీ వివేక్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు రమ్మంటేనే మంత్రులు ఆ నియోజకవర్గాలకు వెళ్తారని, లేదంటే వెళ్లబోరని చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన వినతిపత్రాలను స్వీకరించారు.
ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన భూపట్టాల సమస్యపై అక్కడి జిల్లా కలెక్టర్లతో మంత్రి ఫోన్ ద్వారా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో వివాదంపై మంత్రి పైవిధంగా స్పందించారు. ఎమ్మెల్యేలకు మంత్రుల సహాయం అవసరమైతే చేసి పెడతామని స్పష్టంచేశారు. ప్రేమ్సాగర్రావుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు.
త్వరలో గిగ్ వర్కర్ల చట్టం రూపొందించే ప్రయత్నం జరుగుతున్నదని, సీఎం ఆదేశం మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని వెల్లడించారు. పాశమైలారం ఘటనా స్థలానికి సీఎం రేవంత్ వెళ్లినా కొంతమంది వెళ్లలేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం తగదని చెప్పారు. సమ్మె చేసేందుకు కార్మికులు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు.