సిద్దిపేట, అక్టోబర్ 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి): గత కేసీఆర్ ప్రభుత్వంపై అభాండం వేయబోయిన మంత్రి వివేక్ వెంకటస్వామికి చుక్కెదురైంది. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు కంటే గత కేసీఆర్ సర్కారే నయం అన్న వాస్తవం ఈ సందర్భంగా ఆయనకు బోధపడింది. ఏదో అనుకుంటే.. మరేదో జరిగిందన్న నానుడిలా ఎదురైన ఈ ఆసక్తికర ఘటనతో అవాక్కవడం మంత్రి వంతయింది. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ అరుదైన సంఘటన చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ ఇచ్చిన హమీలు తీర్చడంలో సర్కార్ విఫలం కావడంతో ప్రజల్లో తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతుందనడానికి ఈ ఘటనే సాక్ష్యంగా నిలిచింది. ‘కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇచ్చిండా అమ్మ’ అని ఓ మహిళను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖమంత్రి వివేక్ వెంకటస్వామి అడగారు. ‘హా ఇచ్చిండు.. కేసీఆర్ సార్ అన్నీ మంచిగజేసిండు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఏ ఒక్కటీ సక్కంగ అయితలేదు. మీరు ఇత్తానన్న తులం బంగారం ఏమైంది? తప్పకుండ ఇయ్యాలి. ఇయ్యకుంటే బాగుండదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంతా సర్వనాశనం చేసింది. మీది ఏం ప్రభుత్వమో ఏమో పో.. అన్నీ నాశనం చేసి కుసున్నరు’ అంటూ మంత్రికి ఆ మహిళ ఏకధాటిగా కౌంటర్ ఇచ్చింది.
తమకు ఏ పథకం అందడం లేదంటూ ఆమెతో పాటు అక్కడున్న మహిళలు సైతం వాపోయారు. ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చాయని మంత్రి చేతులెత్తాలని కోరగా ఎవరూ చేతులెత్తలేదు. రేషన్ కార్డులు కూడా రావడం లేదని మహిళలు అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు తాము మిత్తీలు కట్టడానికే ఖజానా ఖాళీ అవుతుందన్న ఆరోపణలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ‘మీరు అబద్ధాలు చెప్పొద్దు. ఖజానాలో డబ్బు ఉన్నది. ప్రజలకు వాస్తవాలు చెప్పి సంక్షేమ పథకాలు అందించాలి’ అని వాదించారు. అప్పులపై చర్చకు తాను సిద్ధమేనని ఆ వేదిక పైనుంచే సవాల్ విసిరారు.
చెక్కుల కోసం పడిగాపులు
సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెకుల కోసం గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆలస్యంగా రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘కనీసం మంచినీళ్లు ఇవ్వలేదు. 4గంటలు పడిగాపులు ఉన్నం. మమ్మల్ని పట్టించుకునే వారే లేరు’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావుకు లబ్ధిదారులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘బీఆర్ఎస్ పాలనల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్నం పెట్టి మీరు కల్యాణలక్ష్మి చెకులను అందించేవారు’ అని వారంతా గుర్తు చేసుకున్నారు.‘ కాంగ్రెస్ పాలనల తిప్పలు తప్పడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర అవస్థలు పడ్డారు.
తులం బంగారం ఇవ్వాల్సిందే..: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం కూడా లబ్ధిదారులకు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి గడ్డం వివేక్‌తో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు రూ.2,500తోపాటు పెళ్లి కానుకగా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మక్కజొన్నను మద్దతు ధరకే కొనాలని, రైతులు పండించిన మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేయాలని మంత్రిని కోరారు.