నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కు సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా సంబురం నెలకొందని, 60 ఏళ్ల గోసను తీర్చి..తెలంగాణ ముఖం తెరువు చేసింది కేసీఆర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కమ్మర్పల్లి మండలంలో శుక్రవారం మంత్రి పర్యటించి సుమారు 10 కోట్ల విలువగల పలు అభివృద్ధి పనుల శంకుస్ధాపన చేసి మాట్లాడారు.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణ లక్ష్మి,కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కుల వృత్తులకు ప్రోత్సాహంతో రైతులు,పేదలు, కుల వృత్తుల మొహాల్లో చిరునవ్వు పూయించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని అన్నారు. సీఎం కేసీఆర్ కంటే ముందు 10ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేసీఆర్ ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు అప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ప్రజలను మభ్య పెట్టేవే అన్నారు.
మన జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ను కాదని..కరెంట్ కోతల, కారు చీకట్ల కాంగ్రెస్‌ను కోరుకుంటమా అని అన్నారు. కాంగ్రెస్ చెప్పిన హామీలు ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇస్తలేరు. తెలంగాణలో ఎట్లా ఇస్తరని ప్రశ్నించారు. కేసీఆర్.. ప్రజలకు ఏమీ కావాలో అది చేస్తడు కానీ అలివికాని హామీలు ఇవ్వడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెట్టిన గోసలు..బీజేపీ చేసిన మోసం రైతులు ఎన్నటికీ మర్చిపోరన్నారు.
కోడి గుడ్డు మీద ఈకలు పీకే కాంగ్రెస్,బీజేపీ నాయకుల మోసపు మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. ఆయా గ్రామాల్లో ప్రజలు తన దృష్టికి తెచ్చిన అభివృద్ధి పనులపై చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భాస్కర్ యాదవ్, కోటపాటి నర్సింహ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.