హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు. సోమవారం తెలంగాణ సెక్రటేరియట్లో ఆర్ అండ్‌బీ ఉన్నతాధికారులతో నిర్వహించిన తొలి సమీక్షలో(Review) మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల డ్యామేజ్ అయిన 1172 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల(Road repairs) పనుల కోసం రూ. 2858 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ రోడ్ల మరమ్మతులపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి కావాలని సూచించారు. ఇప్పటికే 518 కోట్లతో 1393 కి. మి పొడవు గల రోడ్ల మరమ్మతులు పూర్తి చేశామని,రూ. 1,223 కోట్ల విలువగల 455 రోడ్ వర్క్స్ మొత్తం 2,700 కి. వచ్చే 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు పనులు 60 వర్క్ ఏజెన్సీ(Work Agencies)లు పని చేస్తున్నాయని, ప్రతీ ఏజన్సీతో క్షేత్ర స్థాయిలో సమీక్షించి నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం పూర్తి అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతీవారం తానే స్వయంగా రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తానని వెల్లడించారు. ఈ సమీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్,తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆర్ అండ్ బి సెక్రెటరీ శ్రీనివాస రాజు,ఈఎన్సీ రవీందర్ రావు, డీసీ దివాకర్, ఎస్.ఈ వసంత్ నాయక్ ఇతర ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.