Minister Prashanth Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియట్ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. సుమారు ఐదున్నర గంటల పాటు నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన బిల్డింగ్, మినిస్టర్స్ చాంబర్స్, మినిస్టర్ పేషి, కాన్ఫరెన్స్ హాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబర్స్, సెక్షన్ ఆఫీసర్లు, క్లస్టర్డ్ వర్క్ స్టేషన్స్ ఫ్లోర్ వైస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అధికారులు, వర్క్ ఏజెన్సీకి, ఆర్కిటెక్చర్లకు పలు సూచనలు చేశారు. అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించే ప్రాంతం విశాలంగా, అన్ని సౌకర్యాలతో ఉండాలని, అప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణంలో పరిపాలనపరమైన పనులు వేగవంతంగా జరుగుతాయనే దూరదృష్టితో సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌ను అధునాతన హంగులో నిర్మిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్లో ఉన్న వర్క్ ప్లేస్ కంటే తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ వర్క్స్ ప్లేస్ ఎక్కువ అన్నారు.
విశాలమైన గదులు, చాంబర్స్ నూతన సచివాలయంలో ప్రత్యేకతలని వివరించారు. రాష్ట్ర సచివాలయం, ప్రపంచమే అబ్బుర పడేలా, తెలంగాణ ప్రతీకగా నిలిచిపోనుందన్నారు. అంతకుముందు నిర్మాణ ప్రాంగణంలో కలియ తిరుగుతూ పార్కింగ్ ఏరియా, మీడియా, ఏటీఎం, బ్యాంక్, క్యాంటీన్, ప్రార్థనా మందిరాల ఫినిషింగ్ పనులను ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు.