Telangana Martyrs’ Memorial | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతిలో స్మారకాన్ని నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ నాడు కేసీఆర్ నేతృత్వంలో జలదృశ్యంలో సమావేశం నిర్వహించిన ప్రదేశంలోనే నేడు స్మారకాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఆయన హుస్సేన్‌సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను పరిశీలించారు.
ప్రధాన ద్వారం వద్ద రోడ్డు పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల స్థూపం స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడమని పేర్కొన్నారు. జలదృశ్యం సమావేశం, టీఆర్ఎస్ ఏర్పాటును జీర్ణించుకోలేని అప్పటి సీఎం చంద్రబాబు.. అక్కడి కార్యాలయంలోని సామాన్లను బయట పడేయించారని గు ర్తుచేశారు. ఉమ్మడి పాలకులు ఎక్కడైతే అవమానించారో నేడు అక్కడే అమరుల స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. త్వరలోనే కేసీఆర్ చేతులమీదుగా ఈ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మ న్ అల్లం నారాయణ, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, శిల్పి రమణారెడ్డి పాల్గొన్నారు.