హైదరాబాద్ మే 23 (నమస్తే తెలంగాణ ): నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతి బండారం బట్టబయలైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నాడు పీసీసీ చీఫ్ హోదాలో పదవులు ఆశ చూపి విరాళాల పేరిట పైసల వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చొని ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. పాలనను పక్కనబెట్టి ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని తాము చెప్తున్నది నిజమని అనేందుకు ఈడీ చార్జిషీటే నిదర్శనమని పేర్కొన్నారు.
30 శాతం కమీషన్లు లేనిదే పనులు జరగడం లేదని గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ దీనికి సీఎం రేవంత్ ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. గతంలో అమృత్, సివిల్ సప్లయ్ ఇతరత్రా స్కాంలపై ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్నదని స్వయంగా ప్రధాని మోదీయే ఆరోపించారని గుర్తుచేశారు. కానీ చర్యలు తీసుకోవడంలో మాత్రం చేతులెత్తారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌పై చర్యలు చేపట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.