వేల్పూర్/మోర్తాడ్, జూలై 12: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. రైతులకు మళ్లీ పాత రోజులు రావడం ఖాయమని, బీఆర్ఎస్ సర్కారే అన్నదాతకు అండగా ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ వద్ద రూ.29.92 లక్షలు, మోర్తాడ్ మండలం దొన్కల్ వద్ద రూ.33 లక్షల వ్యయంతో ఏర్పా టు చేసిన పైప్లైన్ల ద్వారా వరద నీటిని మంత్రి విడుదల చేశారు. తూముల ద్వారా చెరువుల్లోకి పరుగులు తీస్తున్న కాళేశ్వరం జలాలకు రైతులతో కలిసి ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం లో అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యు త్తు, పెట్టుబడి సాయం, సాగునీటి ప్రాజెక్టుల పథకాలను చూసి యావత్ దేశం ప్రశంసిస్తున్నదని చెప్పారు. ఈ ప్రాంత రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించడంతో తమ జన్మ సార్థకమైందని మంత్రి వేముల భావోద్వేగానికి లోనయ్యారు. అధికారంలో ఉన్నా లేకున్నా చివరి శ్వాస వరకు రైతుల మేలు కోసం కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలతో కూడిన పాత రోజులే వస్తాయని మంత్రి హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయ రంగానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. వ్యవసాయం, రైతుల ఇబ్బందుల గురించి కనీస అవగాహన లేని వారికి అవకాశం కల్పిస్తే నష్టపోయేది రైతులేనని చెప్పారు. రైతాంగానికి మేలు చేసే కేసీఆర్ ప్రభుత్వం కావాలా? లేక కరెంట్ కష్టాలు, సాగునీటి సమస్యలను తెచ్చిపెట్టే పార్టీలు కావాలా? రైతులు, ప్రజలు ఆలోచించాలని సూచించారు.