హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఈ నెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి స్మారక చిహ్నం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి.. అక్కడినుంచే అమరజ్యోతికి సెల్యూట్ చేస్తారని వివరించారు. అంబేద్కర్ విగ్రహ చౌరస్తా నుంచి అమరుల స్మారక చిహ్నం వరకు 6వేల మంది కళాకారులతోప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం 800 డ్రోన్లతో అమరుల త్యాగాలు, తెలంగాణ ప్రగతిపై ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ 10వేల మందితో దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఆ అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు
అమరుల స్మారక చిహ్నంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌పై మంత్రి వేముల మండిపడ్డారు. అమరు ల త్యాగాల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్.. ఢిల్లీలో స్వాతంత్య్ర అమరవీరుల స్మారకాన్ని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ విస్మరించిందని మండిపడ్డారు. పనికి మాలిన విమర్శలు చేసే రేవంత్ దీనికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ అమరవీరుల స్మారకం మనసుపెట్టి నిర్మించామని, అది కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలిపారు. ప్రతిపక్ష నేతలు అమరుల స్మారకాన్ని సందర్శించి వారికి నివాళులర్పించాలని మంత్రి సూచించారు.