ఇష్టమెచ్చినట్టు మాట్లాడితే గ్రామాల్లోకి రానివ్వం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల హెచ్చరిక
బీజేపీ అబద్ధాలపై ఇన్నాళ్లూ ఓపిక పట్టాం. ఇక సహించేది లేదు. దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తుంటే, ఇక్కడ కొందరు కుక్కల్లా మొరుగుతున్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను చూసి తెలంగాణలో కలుస్తామని మహారాష్ట్రలోని 16 గ్రామాలు తీర్మానాలు చేసి వినతిపత్రాలు కూడా ఇచ్చాయి.
కామారెడ్డి, ఫిబ్రవరి 24: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు నోరు పారేసుకొంటే ఊరుకొనేది లేదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయటంలో ఆ పార్టీ నంబర్ వన్ అని విమర్శించారు. ఇష్టమెచ్చినట్టు మాట్లాడితే బీజేపీ నాయకులను గ్రామాల్లో అడుగుపెట్టనివ్వబోమని స్పష్టంచేశారు. తెలంగాణలో అభివృద్ధిని కేంద్రమంత్రులే ప్రశంసిస్తుంటే బీజేపీ నేతలు అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎంకే ముజీబుద్దీన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జిల్లా కేంద్రంలోని సత్యాగార్డెన్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అబద్ధాలపై ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, ఇక సహించేది లేదని హెచ్చరించారు. దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తుంటే, ఇక్కడ కుక్కల్లా మొరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను చూసి తెలంగాణలో కలుస్తామని మహారాష్ట్రలోని 16 గ్రామాలు తీర్మానాలు చేసి వినతిపత్రాలు కూడా ఇచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తే మాటకు మాట జవాబు చెప్పాల్సిందేనని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో బీజేపీ అబద్ధాలను తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.