హైదరాబాద్ : ‘ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డు అందుకున్న తెలంగాణ బిడ్డ గౌరవి రెడ్డి రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద అత్యంత ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులు అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్ట్ అండ్ కల్చర్ కేటగిరీ కింద హైదరాబాద్ కు చెందిన గౌరవి రెడ్డికి అవార్డు దక్కింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు గ్రహిత, ఆమె తల్లి తండ్రులు చంద్ర శేఖర్ రెడ్డి, తరుణారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి వేములను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గౌరవి రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. కూచిపూడి నృత్యకారిణి అయిన గౌరవి రెడ్డి ప్రతిభ యావత్ తెలంగాణకు గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ లో మరింతగా రాణించాలని మంత్రి వేముల ఆకాంక్షించారు.