మక్తల్, జూన్ 27 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే మక్తల్లో ఉన్న తన ఇల్లు అమ్మి లబ్ధిదారులకు పైసలిస్తానని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇల్లు నిర్మించాక సర్కారు నుంచి బిల్లులు వస్తాయా? అన్న అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, ధైర్యంగా ఇంటి నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ఎవరికైనా బిల్లు రాకుంటే తానే పైసలిస్తానని భరోసానిచ్చారు. ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు తీసుకున్న వారందరూ నిర్భయంగా ఇండ్లను నిర్మించుకొని సంతోషంగా రూ.5 లక్షల ఇంటికి యజమానులు కావాలన్నారు.
12 లక్షల క్యూసెక్కులు వచ్చినా జూరాల దెబ్బతినలే..
2009లో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 12 లక్షల క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లో వచ్చినా దెబ్బతినలేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్లో ఆయన మాట్లాడుతూ ప్రసుతం పీజేపీకి వచ్చే వరద నుంచి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. డ్యాం 61 గేట్లు బాగానే ఉన్నాయని, 8 గేట్ల రోప్వేలు తెగినా వచ్చిన నష్టం ఏమీ లేదని తెలిపారు. వీటిలో నాలుగు గేట్లను రిపేర్ చేశారని, మిగితావి చేయాలనుకునేలోపే ప్రాజెక్టుకు వరద రావడంతో పనులు నిలిపివేసినట్టు వెల్లడించారు. 10 లక్షల క్యూసెకులు వచ్చినా నష్టం ఏమీ లేదని స్వయానా ప్రాజెక్టు సీఈ తెలియజేశారని చెప్పారు.