Minister Vakiti Srihari | ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. గత పదేళ్లలో ఆగమైన శాఖలను తనకు అప్పగించారని.. తనకు ఇచ్చిన ఐదుశాఖలు ఆగమాగంగానే ఉన్నాయన్నారు. ఇది అదృష్టమో.. దురదృష్టమో తెలియడం లేదని నిట్టూర్చారు. పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉందని.. యువజన సర్వీసులశాఖ ఇస్తే తానేం చేసుకోవాలి? గొర్రెలు, బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా నిర్వీర్యంగా మారిన మత్స్యశాఖను తనకు అప్పగించారన్న ఆయన.. దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
పశుసంవర్ధక శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తానన్నారు. యువజన సర్వీస్ శాఖను తనకు కేటాయించారని, ఆ శాఖను ఎలా నడపాలో ఇప్పటికీ తనకు స్పష్టంగా తెలియడం లేదని చెప్పుకొచ్చారు. తనకు ఇచ్చిన శాఖలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని.. అయినా తాను భయపడకుండా ముందుకెళ్తానన్నారు. ఎంత కష్టమైనా ఆయా శాఖలను అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాలనలో శాఖల మధ్య సమన్వయం లేకపోతే సమస్యలు తప్పవన్న యన.. తన అనుభవంతో వాటిని అధిగమిస్తానని తెలిపారు. అంతకు ముందు క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ క్రీడా పాఠశాలలకు ఇంటర్నల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ, హ్యాండ్ బాల్ కోర్టుల ఏర్పాటుకు సైతం చర్యలు తీసుకుంటామని, హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ణు ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు.