హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం తలపెట్టింది. ప్రాజెక్టుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలను కేటాయించగా, నేడు కాంగ్రెస్ దానిని 45 టీఎంసీలకే కుదించేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న కేంద్రాన్ని నిలదీయకుండా ఫేజ్-1లో 45 టీఎంసీలకైనా పర్మిషన్ ఇవ్వాలంటూ దేబరిస్తున్నది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఇతర అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడ కేంద్ర జల్‌శక్తిశాఖ సెక్రటరీ కాంతారావు, సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమప్రసాద్ను ప్రత్యేకంగా కలిశారు.
తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పీఆర్ఎల్ఐఎస్) ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్-1కు 45 టీఎంసీలకైనా సత్వరం అనుమతివ్వాలని కోరుతూ లేఖను అందజేశారు. పీఆర్ఎల్ఐఎస్కు తొలుత 90 టీఎంసీల జలాలను కేటాయిస్తూ డీపీఆర్‌ను సమర్పించామని, అయితే సీడబ్ల్యూసీ అనేక కొర్రీలతో అప్రైజల్ లిస్ట్ నుంచి తొలగించిందని మంత్రి వివరించారు. సీడబ్ల్యూసీ కోరిన వివరాలను కూడా తెలిపామని, అయినప్పటికీ డీపీఆర్ పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. అనుమతుల జాప్యంతో ప్రాజెక్టు వ్యయం పెరుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో తాగునీటి పనులకు సంబంధించి ఫేజ్-1లో పీఆర్ఎల్ఐఎస్కు మైనర్ ఇరిగేషన్ నుంచి ప్రతిపాదించిన 45 టీఎంసీలకైనా అనుమతులివ్వాలని విజ్ఞప్తిచేశారు. ట్రిబ్యునల్ అవార్డు అనంతరం ఫేజ్-2లో మిగతా 45 టీఎంసీల పనులను చేపడతామని వెల్లడించారు.
ఏపీని నిలువరించాలి
ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల (పీబీ), పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్) లింక్ ప్రాజెక్టులను చేపట్టకుండా నిలువరించాలని, ఆ మేరకు సీడబ్యూసీ, ఇతర కేంద్ర సంస్థలకు మార్గదర్శకాలు జారీచేయాలని కేంద్ర జల్శక్తిశాఖను మంత్రి ఉత్తమ్ కోరారు. ఏపీ తొలుత పీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టిందని, అందుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజబులిటీ రిపోర్టు)ను సైతం జల్‌శక్తిశాఖకు, సీడబ్ల్యూసీకి సమర్పించిందని గుర్తుచేశారు. కేంద్ర సంస్థలు, కో బేసిన్ రాష్ర్టాలు వ్యతిరేకించడంతో పీబీ లింక్‌ను ఏపీ విరమించుకుందని, దానిస్థానంలో తాజాగా పీఎన్ లింక్‌ను చేపట్టిందని వివరించారు. డీపీఆర్ తయారీకి టెండర్లను సైతం ఆహ్వానించిందని తెలిపారు. ఏపీ మరింత ముందుకు వెళ్లకుండా నిలువరించాలని, పీఎఫ్ఆర్ను పరిగణనలోకి తీసుకోకుండా సీడబ్ల్యూసీకి, ఇతర కేంద్ర సంస్థలకు సూ చించాలని కోరారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు సంబంధించిన భూసేకరణను చేపట్టేందుకు మరోవైపు కర్ణాటక సిద్ధమైందని మంత్రి వివరించారు.
కేసీఆర్ హయాంలో 90టీఎంసీలతో ప్రతిపాదనలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టింది. పోలవరం డైవర్షన్ ద్వారా అందుబాటులోకి వచ్చే 45 టీఎంసీలను, మైనర్ ఇరిగేషన్ కింద ట్రిబ్యునల్ కేటాయించిన 89 టీఎంసీల్లో వినిగియోంచకుండా ఉన్న 45 టీంఎసీలను మొత్తం కలిపి 90 టీఎంసీల నికర జలాలను ప్రతిపాదించింది. ఈ మేరకు జీవో 246ను విడుదల చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను 2022లో సీడబ్ల్యూసీకి సమర్పించింది. పలు అనుమతులను సైతం సాధించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఏకంగా అప్రైజల్ లిస్టు నుంచి తొలగించడం గమనార్హం. అందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సీడబ్ల్యూసీనే స్వయంగా వెల్లడించింది. మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేసే 45.66 టీఎంసీలను వాడుకుంటామని చెప్పారని, అందుకు సంబంధించిన వివరాలివ్వాలని అడిగినా, లేఖలు రాసినా తెలంగాణ కాంగ్రెస్ సర్కారు స్పందించడం లేదని సీడబ్ల్యూసీ ఆక్షేపించింది. గోదావరి నీటిని మళ్లించడం ద్వారా 45 టీఎంసీల అంశం కూడా ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నదని వెల్లడించింది. వాటిపై స్పష్టతనివ్వాలని కోరినా, పలుమార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కారు స్పందించడం లేదని వివరించింది. ఆ నేపథ్యంలో డీపీఆర్‌ను పరిశీలన జాబితా నుంచి తొలగిస్తున్నట్టు సీడబ్ల్యూసీ ఆ లేఖలో నొక్కిచెప్పింది.