హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రైస్ మిల్లర్లు అత్యాధునిక యంత్రాలను, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇంటర్నేషనల్ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పో-2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రైస్ మిల్లింగ్, నాణ్యమైన బియ్యం ఉత్పత్తిలో తెలంగాణను నంబర్‌వన్ రాష్ట్రంగా మార్చడంలో మిల్లర్లకు సంపూర్ణ తోడ్పాటు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రైస్ మిల్లింగ్‌ను ప్రధాన పరిశ్రమగా గుర్తించి దాదాపు 3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విషయంలో ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలని మిర్లర్లను కోరారు. ప్రభుత్వం కిలో రూ.40 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న బియ్యాన్ని దారిమళ్లిస్తున్న మిల్లర్లపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.