హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టును వచ్చే మూడేండ్లలో పూర్తిచేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన సచివాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలారు. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిని అందించిందని, రూ.లక్షల కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ అదనంగా ఒక్క ఎకరానికి నీరివ్వలేదని ఎదురుదాడికి దిగారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆ ప్రాజెక్ట్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఒక ఎకరాకు నీరివ్వలేదని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రెండేండ్ల్లలో తాము రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
సుందిళ్ల నుంచే టెస్టులు చేయాలి
సుందిళ్ల బరాజ్ నుంచే సాంకేతిక పరీక్షలు ప్రారంభించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులకు సూచించారు. మంగళవారం ఆయన బరాజ్‌ల నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బరాజ్‌ల పునరుద్ధరణ పనులపై సమీక్ష జరిపారు.