హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): జలాశయాల్లో పూడికతీత పనులను ఈపీసీ విధానంలో చేపట్టాలని, అప్పుడే నిర్దేశిత సమయంలో పూర్తవుతాయని అధికారులకు మంత్రి వర్గ ఉపసంఘం చైర్మన్, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి పనులు అప్పగించాలని సూచించారు. రాష్ట్రంలోని జలాశయాల్లో పూడికతీతకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేసిన విషయం తెలిసింది.
ఈ కమిటీ ఇప్పటికే సమావేశమై ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులకు సూచించగా, ఆ మేరకు వివరాలు అందించారు. తాజాగా నివేదికపై రాష్ట్ర నీటి పారుదల, రెవెన్యూ, ఖనిజాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సోమవారం క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సభ్యులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టర్లను ఆహ్వానించి గ్లోబల్ టెండర్లు పిలిచి పనులు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. జలాశయాల్లో ఉన్న ఇసుక, మట్టి నిల్వలను ఖనిజాభివృద్ధి సంస్థ అంచనా వేయాలని సూచించారు.
ఇసుక, మట్టి ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయంతో రిజర్వాయర్ల నిర్వహణ చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని జలాశయాలలో పూడికతీత పనులు చేపట్టి వేగంగా పూర్తిచేయాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా చూడాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేసి జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగేలా కృషి చేయాలని, వాటిని పటిష్టంగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏజెన్సీలో ఒకే సమయంలో ఎక్కువ పనులు చేపట్టేలా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
పూడికతీతకు సంబంధించి హైపవర్, టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఖనిజాభివృద్ధి సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి, ఫిషరీస్ తదితర డిపార్ట్మెంట్ల నిపుణులతో హైపవర్ కమిటీ వేయాలని సూచించింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హైడ్రాలజీ, డ్యామ్ సేఫ్టీ, డిజైన్స్ నిపుణులతో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.