హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తేతెలంగాణ): ఈ 2025 సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. నిరుడు విప్లవాత్మక విధానాలతో రాష్ర్టాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టించామని తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ సర్కారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని, ఇందుకోసమే కులగణన చేపట్టామని వివరించారు. ఈ ఏడాదిలో అర్హులందరికీ రేషన్‌కార్డులను అందజేస్తామని, లబ్ధిదారులకు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పారు. రూ.5,000 కోట్లు వెచ్చించి 119 నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలను నిర్మిస్తామని మంత్రి వివరించారు.