హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌కు అనుమతులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కోరారు. బుధవారం ఆయ న ఢిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్‌ను కలిసి, రాష్ర్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ స్కీంతోపాటు సమ్మక్కసాగర్ బరాజ్ అనుమతులు మంజూరు చేయాలని, నీటి కేటాయింపులు పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయించడంతోపాటు ముంపు నుంచి తెలంగాణకు రక్షణ కల్పించాలని విన్నవించా రు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికను సీడబ్ల్యూసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ నివేదికలోని అంశాలపై ముందుకెళ్లే ప్రక్రియను సీడబ్ల్యూసీ పర్యవేక్షించాలని, సాంకేతిక సలహాలు ఇవ్వాలని, ఎన్డీఎస్ఏ నిర్దేశించిన పునరుద్ధరణ అంశాలపై సలహా ఇవ్వాలని కోరారు.