Rythu Runa Mafi |హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు మొదటినుంచీ అనుమానిస్తున్నట్టే జరిగింది. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వరకు తాత్సారం చేసి, ఎన్నికల కోడ్ రాగానే దానిని సాకుగా చూపించి తప్పించుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ చెప్తూనే ఉన్నది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాల నిజం చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ‘ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రుణమాఫీ ఎలా చేస్తాం? ఈ మాత్రం కూడా కేసీఆర్‌కు తెలియదా?’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలవుతున్నా ఆ హామీ అమలుకాలేదు.
ఈ నేపథ్యంలో ఆదివారం పలు జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్.. ఎన్నికల కోడ్ ఉండగా రుణమాఫీ ఎలా చేస్తామంటూ చేతులెత్తేశారు. దీంతో ఉత్తమ్ వ్యాఖ్యలను ఇటు రైతులు, అటు బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్న విషయం తెలియదా? ఎన్నికల కోడ్ వస్తుందని తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కోడ్ వచ్చిందంటూ సాకులు చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోడ్ రాకముందే రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ ఆకస్మికంగా వచ్చినదేమీ కాదు. మార్చి రెండో వారంలో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని, ఆ మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనేది ఆర్నెళ్ల క్రితం నుంచి అందరూ ఊహిస్తున్నది. నిజంగా రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే అప్పటికే మూడు నెలల సమయం ఉన్నదని రైతులు గుర్తుచేస్తున్నారు.
ఇన్నాళ్లూ తాత్సారం చేసి ఇప్పుడు కోడ్ వంకలు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం యాసంగి సీజన్ రైతుబంధు నిధులు విడుదల చేయడానికి ప్రయత్నించగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, నిలుపుదల చేయించిందని గుర్తుచేస్తున్నారు. నాడు రైతుబంధుకు ఎన్నికల కోడ్ నిబంధన వర్తించినట్టే.. ఇప్పుడు రుణమాఫీకి సైతం వర్తిస్తుందన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తెలియదా? తెలిసీ ఎందుకింత తాత్సారం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు చేసిందనే విమర్శలొస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ కన్నా ముందే రుణమాఫీ చేసేదని అంటున్నారు. రుణమాఫీ చేయలేనివాళ్లు డిసెంబర్ 9న మొత్తం రుణమాఫీ చేస్తామని ప్రకటించడం ఎందుకు? రైతులను మోసం చేయడం ఎందుకు? అనే ప్రశ్నలు వినిస్తున్నాయి.