హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరదనీటిని రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోయాలని సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని పేర్కొన్నారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ జలాశయాల వరకు ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని సూచించారు.
సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల వరకు నీటిని తరలించాలని తెలిపారు. మల్లన్నసాగర్లో గరిష్ఠంగా 20 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏఈల నుంచి సీఈల దాకా క్షేత్రస్థాయిలోనే ఉండి వరద ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో రెడ్ అలర్ట్ నేపథ్యంలో నీటిపారుదలశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్టు తెలిపారు.
ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గండ్లు పడిన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజుర్నగర్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను సోమవారం పర్యటించనున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.