జయశంకర్ భూపాలపల్లి. జూన్ 10 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులకు మరో ఏడాది గడువు పెట్టారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. వచ్చే ఏడాది వర్షాకాలం ప్రారంభంలో ఉపయోగంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను ఉత్తమ్ కుమార్‌రెడ్డి మిలిటరీ ఇంజినీర్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కల్నల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు పడకపోతే జూలై మొదటి వారంలో అన్ని పరీక్షలు పూర్తి చేస్తామని, వర్షాలు పడితే నవంబర్, డిసెంబర్ నాటికి పరీక్షలు పూర్తి చేసి.. వచ్చే ఏడాది జూన్, జూలై కల్లా మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
అయితే తాము అధికారంలోకి వచ్చిన నాటినుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నుంచి చుక్కనీరు వాడుకోకుండానే 2025-26, యాసంగిలో 295 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి, 147 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. 2014కు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 38 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 30శాతం పనులు పూర్తయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే పక్కన పెట్టి మేడిగడ్డ బరాజ్ రూపకల్పన చేసిందని తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదని, కావాలనే మేడిగడ్డకు మార్చి రూ.లక్షా 45వేల కోట్ల పనులు చేపట్టారని, లోపభూయిష్ట నిర్మాణంతో బరాజ్ కుంగిందని ఆరోపించారు. సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ సంస్థలచే సాంకేతిక పరీక్షలు చేయిస్తున్నామని, డిసెంబర్ నాటికి పరీక్షలు పూర్తిచేసి నివేదికల ఆధారంగా 2027 జూలై వరకు ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని తెలిపారు.
మేడిగడ్డ బరాజ్ పరిశీలనకు వచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. పిల్లర్ కుంగిన ఏడో బ్లాక్‌ను పరిశీలించకుండానే తిరుగుముఖం పట్టారు. అధికారులు కనీసం ఏడో బ్లాకు వద్ద ఎలాంటి ఏర్పాటు చేయకుండా మిగిలిన రెండు మూడు బ్లాకుల వద్దకు తీసుకెళ్లి వారు చేస్తున్న పరీక్షల గురించి వివరించి పంపించేశారు. దీంతో అధికారులు ఎలాంటి లోపం లేని బరాజ్ పిల్లర్ల వద్ద జరుగుతున్న టెస్టింగ్ పనులను మాత్రమే చూపారని, అసలు కుంగిన పిల్లర్ వద్ద పరిస్థితి ఎలా ఉందో వివరించే ప్రయత్నం ఎవరూ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఏడో బ్లాకు 20వ పిల్లర్‌ను ఇటీవల బీఆర్ఎస్ బృందం ఇటీవల పరిశీలించింది. సర్కార్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం కుంగిన పిల్లర్ నుంచి గోదావరి నీళ్లు యథేచ్ఛగా కిందికి తరలివెళ్తున్నాయి.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్లో బరాజ్‌ల పరిశీలన పేరుతో అరగంటలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మిలిటరీ ఇంజినీర్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి బరాజ్‌ను పరిశీలించిన ఆయన.. కల్నల్‌తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. అనంతరం ఉత్తమ్ మళ్లీ పాతపాటే పాడి మరో ఏడాదికి బరాజ్‌ను ఉపయోగంలోకి తీసుకువస్తామని సెలవిచ్చారు. అనుకున్నట్టుగానే వర్షాల పేరుతో మళ్లీ నవంబర్, డిసెంబర్లో పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. అయితే మంత్రి అక్కడి నుంచి ఆగమేఘాలపై ఇది చెప్పడానికే వచ్చారా.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా మళ్లీ బరాజ్ మరమ్మతు పనులు మరో ఏడాది వాయిదా పడటం గమనార్హం.