ధర్మారం, ఆగస్టు 3: తెలంగాణకు నష్టం కలిగించేలా గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అడ్డుకొని తీరుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. ఆదివారం ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేశారు.
అనంతరం రూ.45.15 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఏపీ అక్రమంగా నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు.