హైదరాబాద్, జూలై6 (నమస్తే తెలంగాణ): ‘పంపులు ఆన్ చేస్తరా? లేదంటే రైతులతో తరలివెళ్లి ఆన్ చేయమంటారా’ అన్న మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరికలతో సర్కారులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. కల్వకుర్తి పంపులను ఆన్ చేస్తామని ఆ వెంటనే సర్కార్ ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం పాతపాటనే వినిపించింది. ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ దాటవేసేందుకు సిద్ధమైంది. సాగునీటి విడుదలలో సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం మీడియా సమావేశంలో నిప్పు లు చెరిగారు. వారం వేచిచూ స్తాం.. మోటర్లు ఆన్ చేస్తారా సరే! లేదంటే కేసీఆర్ నేతృత్వంలో రైతులతో తరలివెళ్లి పంపులను ఆన్ చేస్తామంటూ సర్కారుకు అల్టిమేటం జారీచేశారు. హరీశ్‌రావు హెచ్చరికలతో సర్కారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ మేరకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ స్పందించారు. కల్వకుర్తి పంపులను జూలై చివరన లేదంటే ఆగస్ట్ ఒకటో తేదీన ఆన్‌చేసి వానాకాలం పంటలకు నీళ్లందిస్తారని ఆదివారం సాయంత్రమే మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11న నిర్వహించనున్న స్కైవమ్ (స్టేట్ లెవల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్-మేనేజ్మెంట్) మీటింగ్‌లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు ప్రణాళిక సిద్ధమవుతుందని కూడా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం ఎన్డీఎస్ఏ సలహాలు, సూచనల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి దాటవేశారు. మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్లకు తరలించాల్సి ఉన్నదని, ఆ 3 బరాజ్‌లను వినియోగించవద్దని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని మంత్రి ఉత్తమ్ తన ప్రకటనలో తెలపడం గమనార్హం.