హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈఎన్సీ (రామగుండం) ఎన్ వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్‌ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడిగడ్డ బరాజ్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అయితే కేఆర్ఎంబీ అంశాన్ని మరుగున పడేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది. 13వ తేదీన నల్లగొండలో భారీ సభ నిర్వహించి ప్రభుత్వంపై పోరాడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగ్‌సైరన్ మోగించారు. దీంతో ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకొన్నట్టు భావిస్తున్నారు. వాస్తవానికి మేడిగడ్డ బరాజ్ కుంగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈఎన్సీలపై తీవ్ర ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కించింది. తీరా ఇప్పుడు ప్రాజెక్టుల అప్పగింతపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈఎన్సీలపై చర్యలు తీసుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్ అధికారులతో ప్రధాన మంత్రి కార్యాలయ బృందం గురువారం ఢిల్లీలో భేటీ కానున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయా రాష్ర్టాలకు చెందిన అపరిష్కృత సమస్యలపై చర్చించనున్నారు. ఇందులో కేఆర్ఎంబీపైనా చర్చిస్తారని సమాచారం.