Uttam Kumar Reddy | సూర్యాపేట, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెలికాప్టర్ సదుపాయం ఉంటుంది. గవర్నర్, ముఖ్యమంత్రి, కీలక అధికారులు అత్యవసర, దూర, మారుమూల ప్రాంతాల పర్యటనల కోసం ఉపయోగించుకోవచ్చు అనేది ప్రధాన ఉద్దేశం. ఏదైనా విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు హెలికాప్టర్ ద్వారా సహాయ బృందాలను రంగంలోకి దింపిన సందర్భాలను గత బీఆర్ఎస్ పాలనలో చూశాం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హెలికాప్టర్ వాడకం గమనించి, గాలిమోటర్ను ఇట్ల కూడా వాడుకోవచ్చా అని జనం ఇచ్చంత్రంగా చూస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారులో మంత్రులు దాన్ని హెలికాప్టర్ అనుకుంటున్నారా? పల్లెవెలుగు బస్సు అనుకుంటున్నారా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రభుత్వం దివాలా తీసిందని ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతుంటే మంత్రులకు గాలిమోటర్ల సోకు ఎక్కువైందని కొందరు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. మరీ రెండు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడడం ఏందయ్యా? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్ వినియోగం మితిమీరిపోయిందని ప్రభుత్వవర్గాల్లోనే చర్చ నడుస్తున్నది. హైదరాబాద్ నుంచి కాలు బయటపెట్టి కదులుతున్నారంటే చాలు బండి రెడీ అయిందా? అని కొందరు అధికారులు చమత్కారంగా మాట్లాడుకుంటున్నారట. బండి అంటే కారో, బస్సో, వ్యానో కాదని.. మంత్రి దృష్టిలో వాహనం అంటే హెలికాప్టరేనని ఎద్దేవా చేస్తున్నారట. తరచుగా మంత్రి పర్యటనలు సాగుతున్న తీరే ఇందుకు కారణమని కొందరు సహచర మంత్రుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే శనివారం నాటి ఉత్తమ్ పర్యటనలో హెలికాప్టర్ వాడకంలో పరాకాష్ట ఏంటో చూపించారని కొందరు విమర్శిస్తున్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆదివారం జరగనున్న సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు అని చక్కర్లు కొట్టారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన ఉత్తమ్ కోదాడకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం హుజూర్నగర్ రామస్వామిగుట్ట సమీపంలోని హౌసింగ్‌కాలనీకి వెళ్లారు. ఆ తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సీఎం సభాస్థలానికి చేరుకుని, ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి నుంచి మేళ్లచెరువుకు, అనంతరం నేరేడుచర్లలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
మంత్రి హెలికాప్టర్లోనే వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి కోదాడ వరకు హెలికాప్టర్లో వెళ్లొచ్చని, స్థానికంగా చిన్నచిన్న దూరాలకు కారు వాడుకుని, తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ రావొచ్చు కదా అని కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కానీ మంత్రి మాత్రం స్థానికంగానే కోదాడ నుంచి నేరేడుచర్ల మధ్య 59.5 కిలోమీటర్ల పర్యటన కోసం హెలికాప్టర్లో నాలుగుసార్లు ఎక్కిదిగడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చిన్నచిన్న దూరాలకే మంత్రి గాల్లో ఎగురుకుంటూ ప్రయాణిస్తుంటే, అధికారులు కార్లలో ఉరుకులు, పరుగులు తీయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
శనివారం మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం హుజూర్నగర్, తన భార్య పద్మావతి నియోజకవర్గం కోదాడకు హెలికాప్టర్లోనే వెళ్తున్నారు. 15 నెలల్లోనే ఈ రెండు నియోజకవర్గాల పర్యటనకు దాదాపు పదిహేనుసార్లు హెలికాప్టర్లో వెళ్లారని తెలుస్తున్నది. ఎస్ఎల్బీసీ సహాయ చర్యల పరిశీలనకు కూడా ఉత్తమ్ హెలికాప్టర్లోనే వెళ్లారు. కరీంనగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ కోసం మంత్రి కొండా సురేఖతో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్లోనే ప్రయాణించారు. ఉత్తమ్ గాలిమోటర్ టూర్లు చూస్తున్న ప్రజలు నీటిపారుదలశాఖ మంత్రి… ప్రజధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.